కాపు రిజర్వేషన్లపై జగన్ ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని, కెమారాల్లో రికార్డు అయిన జగన్ వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని మంత్రి లోకేష్ అన్నారు. బుధవారం ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ఐటీ కంపెనీలను గుంటూరు జిల్లా తాడే పల్లిలోని ఇన్ఫోసైట్ భవనంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత కావాలన్న విషయం జగన్ వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తే బాధ కలుగుతుందన్నారు. తనపై అవినీతి, దోపిడీ ఆరోపణలు చేయడం తగదన్నారు. సాక్ష్యాకధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరినా ఇంత వరకు పవన్ నిరూపించ లేకపోయారని ఎద్దేవా చేశారు.
రాజధాని నిర్మాణాన్ని ఆపుతామని పవన్ అనటం సరికాదన్నారు. 10మందికోసం రాజధాని నిర్మాణం ఆగదని మంత్రి లోకేష్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు సైబరాబాద్‌లు నిర్మించాలనేదని తమ విజన్ అని మంత్రి లోకేష్ తెలిపారు. బుధవారం కొత్తగా ఏర్పాటైన 10ఐటీ కంపెనీల సీఈఓలతో మంత్రి సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లడుతూ లక్ష ఐటీ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఐటీలో 36వేలు, ఎలక్ట్రానిక్స్‌లో 20వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. జియో ఫోన్ల తయారీ కోసం తిరుపతిలో 125 ఎకరాలు సేకరించామని సమావేశంలో చెప్పారు.
విశాఖ, చిత్తూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఐటీ అభివృద్ది చేస్తున్నామన్నారు. ఏపీలో ఎంఓయూ కన్వర్షన్ 48నుంచి 53శాతం ఉందని మంత్రి తెలిపారు. ఫైబర్ గ్రిడ్‌కు ఎంఎస్‌వోలు సహకరించాలని కోరారు. ఫైబర్ గ్రిడ్‌తో ఎంఎస్‌వోలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఆగస్టు 15నాటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా 5లక్షల కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని పంచాయితీలకు ఫ్రీవైఫై కనెక్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు నిర్ణయం తీసుకున్నామని ఈసందర్భంగా లోకేష్ పేర్కొన్నారు.