వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, ప్రజల దీనెనలతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తే ఒక్క మందు షాపు కూడా లేకుండా చేస్తానని హామీ యిస్తున్నానని అన్నారు. ‘2018 లోనో లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి. మన ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత ఐదేళ్లకు 2024లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో జరిగే ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చే సరికి ఒక్క మందు షాపు కూడా కనపడకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాను’ అని జగన్ అన్నారు.
మరో పక్క చంద్రబాబు పై విమర్శలు చేస్తూ... "చంద్రబాబు నాలుగేళ్ళ పాలనలో కనిపించేవి.... మోసం, అవినీతి, అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలు చెప్పే వారు, మోసం చేసే వ్యక్తులు పూర్తిగా పోవాలి. చెడిపోయిన రాజకీయాల్లోకి నిజాయితీ రావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానా పని తాను చేస్తానని చెబితే.. అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి రావాలి. చంద్రబాబు నాయుడును పొరపాటున క్షమిస్తే.. ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు.. నేను వచ్చిన తరువాత అవినీతి ప్రక్షాళన చేస్తా.. నా హయంలో, అవినీతి అనే మాట లేకుండా చేస్తా, అవినీతి పై పోరాటం చేస్తా" అంటూ ప్రసంగం చేసారు. మరో పక్క, హోంమంత్రి చినరాజప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు.
జిల్లాలో శాంతి భద్రతలు కరువయ్యాయని విమర్శించారు. దీనికి పెద్దాపురం పరిసరాల్లో ఆరు హత్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆనూరుమెట్ట గ్రావెల్ మాఫియా వెనుక చినరాజప్ప, ఆయన తనయుడి ప్రమేయం ఉందని జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల పై చినరాజప్ప స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలను హోంమంత్రి చినరాజప్ప తిప్పికొట్టారు. అసహనంతోనే జగన్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో పెద్దాపురం నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగితే ఆరు హత్యలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగడం లేదని చెప్పారు. జగన్ పాదయాత్రలో జనమే లేరని చినరాజప్ప ఎద్దేవా చేశారు.