పార్లమెంటు బయటే కాదు లోపల కూడా టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్న డిమాండ్లను ఈరోజు కూడా ఎంపీలు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు దగ్గర బంధుత్వం ఉందని కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. ఆందోళన విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కేంద్ర మంత్రి అనంతకుమార్ వారిని కోరారు.
అయితే టీడీపీ ఎంపీలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు కోరారు. దీంతో కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. ఏపీ సమస్యలు తనకు కూడ తెలుసునని చెప్పారు. లోక్‌సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అనంతకుమార్ కోరారు. కర్ణాటకకు చెందిన అనంతకుమార్ ప్రస్తుతం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు.
ఎంపీ శివప్రసాద్ తనదైన స్టైల్లో కొత్తవేషంలో నిరసన తెలిపారు. సర్ ఆర్దర్ కాటన్ వేషధారణలో ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి ఎలిగెత్తి చాటారు. వర్షంలో తడుస్తూనే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ‘స్వదేశీయుడైన మోదీ ఆంధ్రరాష్ట్రంతో చెలిమి చేసి, గెలిసి ప్రధాని అయ్యాక ఇప్పుడు మాట తప్పుతున్నారని, ప్రధానిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి....వితండ వాదం మాని, సకాలంలో నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయండి...చరిత్రలో నిలిచిపోతారు’ అని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ‘పార్లమెంటులో ఎంతో మంది వచ్చారు పోయారు...మీరు కూడా పోతారని అయితే మనిషిగా వెళ్లండి’ అని సూచించారు. అలా కాకుండా మొండి వైఖరితో ముందుకు వెళ్తే ప్రజలే చూసుకుంటారని ఎంపీ శివప్రసాద్ అన్నారు.