వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక పార్టీకి అధినేత. పైగా రాష్ట్ర ప్రతిపక్ష నేత. ఇంతటి హోదాలో ఉన్న వ్యక్తి చౌకబారు వ్యాఖ్యలు చేసి జనంలో పదేపదే చులకనవుతుండటం వైసీపీని కలవరపాటుకు గురి చేసే అంశం. పార్టీ అధినేత చేసే వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించడానికి ఆ పార్టీ నేతలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. తాజాగా పవన్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్ గతంలో కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు సీఎం సీటులో కూర్చున్నారన్న అక్కసో లేక తాను కూర్చోలేకపోయానన్న ఆవేదనో తెలియదు గానీ చంద్రబాబును ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పులతో కొట్టాలని జగన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మరోసారి మరింత తీవ్రంగా.. చంద్రబాబును ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. చంద్రబాబును కాల్చి చంపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ ‘కొత్త కారు మార్చినంత ఈజీగా పవన్‌కల్యాణ్ పెళ్లాల్ని మార్చేస్తాడు. ఇప్పటికే నలుగుర్ని మార్చాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడ..?’ అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి అనేక వ్యక్తిగత ఆరోపణలు ఇది వరకు చేసారు. చంద్రబాబుని అవహేళన చెయ్యటం, లోకేష్ గురించి వ్యక్తిగతంగా హేళన చెయ్యటం, ట్వీట్లు వేసి రాధాకృష్ణా, రవి ప్రకాష్ భార్యల ఫోటోలు పెట్టి వెకిలిగా ట్వీట్ చెయ్యటం, ఇలా ఎన్నో పనులు పవన్ కూడా చేసారు.
ఇద్దరూ ఇద్దరే అని, ఎవరి మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అభిప్రాయ పడుతుంది. జగన్-పవన్ వివాదంలో తలదూర్చవద్దని టీడీపీ అధిష్ఠానం నుంచి నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని, మధ్యలో తలదూర్చి ఇరుక్కోవద్దని అధిష్ఠానం సూచించింది. ఎవరూ తక్కువ కాదని, ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటంలో, ఒకరికి మించిన వారు, ఒకరని, పవన్ కూడా నిన్న జగన వ్యాఖ్యల పై స్పందిస్తూ, చంద్రబాబుని కూడా లాగి విమర్శలు చెయ్యటాన్ని ప్రస్తావిస్తూ, టిడిపి అధిష్టానం స్పందించింది. పవన్, జగన్ ల వ్యక్తిగత దూషణల ఫై, విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే వెనక్కి తగ్గారు. సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరినప్పుడు చాలామంది నేతలు నిరాకరించారు.