ఆంధ్రప్రదేశ్ సమస్యల పై ఢిల్లీతో పోరాడదాం రండి అంటే, నాలుగు నెలల నుంచి ఈ జగన్, పవన్ లలో ఒక్కడు కూడా, మోడీ అనే పేరు ఎత్తలేదు. కాని వెరైటీగా, చంద్రబాబుని మాత్రం, ఏకి పెడుతున్నారు. హోదా రాజకపోయినా చంద్రబాబే, జోన్ రాకపోయినా చంద్రబాబే, విభజన హామీలు ఒక్కటీ అమలు కాకపోయినా చంద్రబాబే. తెలుగుదేశం పార్టీ, ఢిల్లీలో మోడీ పై యుద్ధం చేస్తుంటే, ఆ పోరాటాన్ని దేశం మొత్తం మెచ్చుకుంటుంటే, ఈ వీరులు మాత్రం, ఆంధ్రప్రదేశ్ లో చిల్లర పంచాయతీ చేస్తున్నారు. నువ్వు వెధవ అంటే నువ్వు వెధవ అని.. నీకు నలుగురు పెళ్ళాలు అంటే, నువ్వు లక్ష కోట్ల దొంగ అని, ఇలా చిల్లర తనంగా కొట్టుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ రోజు కూడా మోడీని ఢిల్లీలో డీ కొట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అంటే, మరో సారి ఎండగట్టింది.
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ గంగలో కలిపారని తెదేపా లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో జీరో అవర్ సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన ఆయన తెలుగులో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భగా ప్రధాని ఇచ్చిన సమాధానం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని విమర్శించారు. ప్రజలంతా కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పారు. 2014లో రూపొందించిన రాష్ట్ర విభజన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపైనే ఉందన్నారు.
విభజన సమయంలో ఆనాడు మోదీ సహచరులతో మాట్లాడాకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాజ్యసభలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తోట నర్సింహం ప్రస్తావించారు. కేంద్రం ఇప్పటికైనా ఏపీకి జరిగిన అన్యాయంపై కళ్లు తెరవాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా రూపొందించిన చట్టాలను అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను కూడా ప్రస్తావించడంలేదన్నారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సుమారు గంటన్నర పాటు మాట్లాడిన నరేంద్ర మోదీ రాజకీయ ఉపన్యాసం చేశారు తప్ప ఏపీకి సాయం చేసేలా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తంచేశారు.