మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 వరకు పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొంది. ఆ సమయంలో మూలవర్ల దర్శనానికి సమయం చాలా తక్కువగా ఉంటుందని పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వీరిరువురు మీడియాకు వివరించారు. ఎక్కువ మందికి దర్శనం కల్పించలేని పరిస్థితుల్లో ఎలా చేస్తే బాగుంటుందనేది భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. ఇందులో ఎక్కువశాతం మంది సర్వదర్శనం ద్వారా క్యూలైన్లో అనుమతించాలని సూచించారన్నారు.
11న అంకురార్పణం రోజున 9 గంటలు, 12, 13 తేదీల్లో 4 గంటలు, 14న 6గంటలు, 15న 5 గంటలు, 16న 4 గంటలు మాత్రమే దర్శనాలకు అవకాశం ఉంటుందన్నారు. యాగశాల ఏర్పాటువల్ల విమాన ప్రాకారంలో సగభాగం ఆక్రమిస్తుందని, దాంతో దర్శనం చేసుకున్న భక్తులు కొద్దికొద్ది మంది మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ సమయాలను అనుసరించి రోజులో ఎంతమందిని అనుమతించాలన్న సంఖ్యను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆ సంఖ్య చేరుకొన్న తర్వాత క్యూలైన్‌ను మూసివేస్తామన్నారు.
ఈ సమాచారానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని చెప్పారు. వీఐపీ బ్రేకు దర్శనాలు పూర్తిగా ఉండవని, రూ.300, ఆర్జితసేవలు ఇప్పటికే నిలిపివేశామని, ప్రత్యేక దర్శనాలు, స్లాట్ దర్శనాల రద్దుకు నిర్ణయించామన్నారు. ఆ ఆరు రోజులూ టీటీడీ చైర్మన్, సభ్యులు, అధికారులతో సహా ఎవరి సిఫారసులూ పని చేయవని స్పష్టం చేశారు. పుష్కరకాలానికో మారు నిర్వహించే వైదిక క్రతువు నిర్విఘ్నంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. టీటీడీ ఇచ్చిన నోటీసులకు స్పందించని శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయ్సాయిరెడ్డిలపై తదుపరి న్యాయపరమైన చర్యలకు నిర్ణయం తీసుకొన్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.