మొన్న గల్లా ఇంగ్లీష్ లో, రామ్మోహన్ హిందీలో, మోడీని ఎలా వాయించారో చూసాం. ఈ రోజు రాజ్యసభలో సియం రమేష్ తెలుగులో, దంచి కొట్టారు. సియం రమేష్ స్పీచ్ అందరికీ వారి వారి భాషల్లో తర్జుమా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. పలువురు సభ్యులు మాట్లాడిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖమంత్రి పీయూష్ గోయల్ గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెబుతూ విభజనకు ముందు రాష్ట్రంలో విద్యా సంస్థలు లేవన్నట్టుగా మాట్లాడటంపై రమేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రత్యేక ప్యాకేజీలో అన్నీ చేస్తామంటే ప్రత్యేకహోదాను వదులుకున్నామని.. రెండేళ్లు అయినా దాన్ని పట్టించుకోలేదన్నారు.
. ఏపీ ప్రజలంటే ఎందుకు అంత నిర్లిప్తతని ప్రశ్నించారు. యూపీకి, మహారాష్ట్రకు, గుజరాత్‌కు వెళ్లిన ప్రధానికి ఏపీకి రావడానికి సమయం లేదన్నారు. ఓట్లు, సీట్లు లేకే అలా చేశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు పరిణతి లేదని అంటున్నారని.. మోదీ కంటే ఏడేళ్ల ముందు చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు. అంతటి నాయకుడికి పరిణతి లేదని ఎలా అంటారన్నారు. ప్రాంతీయ పార్టీలను అణచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని.. కేంద్రమంత్రులు, ఎంపీలు సత్యదూరాలైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని రుజువు చేస్తే నేను ఇప్పుడే పదవికి రాజీనామా చేసి పోతా. ఎక్కడ చెప్పారో చూపించమనండి. తెదేపా ప్రభుత్వం యూటర్న్ తీసుకుందంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వబోమని, దానికి సమానమైన ప్రయోజనాలు చేకూరుస్తామని అన్నారు గనకే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. ఇప్పటికి రెండేళ్లు గడిచినా ఒక్క పైసా కూడా మాకు రాలేదు. మా సీఎం చంద్రబాబు 29 సార్లు దిల్లీకి వెళ్లి కాళ్లరిగేలా తిరిగితే ఒక్కపైసా కూడా విదల్చకుండా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నామంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం. ఏపీ ప్రజలంటే ఎందుకింత నిర్లక్ష్యం? తమ భాగస్వామ్య పక్షంగా ఉన్న తెదేపా పాలిస్తున్న ఏపీకి ప్రధాని ఒక్కసారైనా వచ్చారా? ఏపీకి రాకుండా అమెరికాకు నాలుగేసార్లు పోతారా? భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లారు? అని అన్నారు.