ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బీజేడీ సభ్యుడు ప్రసన్న ఆచార్య అన్నారు. విభజన సమస్యలపై రాజ్యసభలో జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగిస్తూ ఇద్దరు ప్రధానులు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారనీ, అది అమలు జరిగి తీరాల్సిందేనని అన్నారు. కేంద్రంలోని మెడీ సర్కార్ వైఖరి వల్ల సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక్కటే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఓడిశాకు ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామని ఆయన అన్నారు.
ఒడిశాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని అన్నారు. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆచార్య.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా పక్కపక్క రాష్ట్రాలేనని, ఏపీ సమస్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు. కేంద్రం సవతతల్లి ప్రేమను తామూ రుచిచూశామన్నారు.
ప్రత్యేక హోదా పొందాల్సిన అర్హతలు ఏపీకే కాదు.. ఒడిశాకూ ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య దేశానికి దేవాలయంలాంటి పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, ఇద్దరూ తమ హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఫెడరలిజానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.