విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్‌గా, విద్యాబాలన్ బసవతారకంగా నటిస్తున్నారు. క్రిష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకురి నిర్మాతలు. ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా సెట్లో రానా అడుగుపెట్టారు. దీంతో నిన్న అమరావతి వచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసారు. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నటుడు దగ్గుబాటి రానా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. చిత్ర షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్, బసవతారకం సొంత ఊర్లయిన నిమ్మకూరు, కొమరవోలుల్లో లోకేషన్లను యూనిట్ శనివారం పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సీఎంను చిత్రబృందం కలిసింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని, దీనికి ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీపరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇవే సినీ పరిశ్రమకు చాలా ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త రాజధాని అమరావతితో పాటు అనేక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యమంత్రితో వీరు అన్నారు. అందుకు తగ్గట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది నిలదొక్కుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని దర్శకులు క్రిష్, హీరో రానా అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నెలకొల్పడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను చూస్తే సినీ టూరిజం అనే కొత్త తరహా ఆకర్షణను కూడా ప్రముఖంగా ప్రోత్సహించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తాము కూడా తగిన సహకారం అందిస్తామని చెప్పారు.