అమరావతిని ఆపటానికి, నష్టం చెయ్యటానికి, హైదరాబాద్ బ్యాచ్ చెయ్యని ప్రయత్నాలు లేవు. ఒక పక్క జగన్ ఎలాంటి పనులు చేస్తున్నాడో చూసాం, ఇప్పుడు జగన్ కు తోడుగా పవన్, వీళ్ళిద్దరీకి తోడుగా బీజేపీ తయారయ్యింది. 5 శాతం మంది కోసం, 95 శాతం మందిని ఇబ్బంది పెడుతున్నారు. అమరావతికి రాచమార్గంగా అభివర్ణితమవుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఆటంకం ఏర్పడింది. రాజధానిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానించడమే కాకుండా అమరావతిలో పడమర కొసన ఉన్న దొండపాడు వరకు సాగే ఈ రహదారికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కనకదుర్గమ్మ వారధి నుంచి దొండపాడు వరకు మొత్తం సుమారు 21.2 కిలోమీటర్ల పొడవున నిర్మించదలచిన ఈ రహదారికి ఇరువైపులా లెక్కకు మిక్కిలిగా ప్రాజెక్టులు రానున్నాయి.
దీంతో రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు సమీపాన ఉన్నంత డిమాండ్ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ప్లాట్లకు ఉంది. అమరావతిలో స్థలాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రముఖ సంస్థల్లో చాలావాటి ప్రథమ ఛాయిస్ సీడ్ యాక్సెస్‌కు చేరువలోనే అంటే దీనికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఈ అత్యంత కీలక రహదారి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. 2 ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డులోని దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన మొదటి ప్యాకేజీ (దొండపాడు- వెంకటపాలెం మధ్య) పనులు చురుగ్గా సాగుతూ, మరికొన్ని నెలల్లోనే పూర్తవనున్నాయి. కానీ 2వ ప్యాకేజీ అయిన సుమారు 3.2 కి.మీ. పొడవుండే భాగంలో నిర్మాణం మాత్రం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు.
వెంకటపాలేనికి చెందిన కొద్దిమందితో పాటు పెనుమాక, ఉండవల్లి రైతుల్లో పలువురు ఈ భాగానికి అవసరమైన భూములను సమీకరణ ప్రాతిపదికన ఇచ్చేందుకు ససేమిరా అంటుండడమే దీనికి కారణం. అధికారులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు ఎల్పీఎస్ కింద వారి భూములను తీసుకునే గడువును పొడిగించుకుంటూ పోతున్నా, ఇవేవీ ఫలించేలా లేవన్న అభిప్రాయంతో భూసేకరణకు నోటీసులు జారీచేసినా పరిస్థితిలో అంతగా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజధానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రైతులను భయపెట్టి భూములను తీసుకుంటే సహించేది లేదని రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. అమరావతికి ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగా జరిగిపోయిన టైంలో, పవన్ చేస్తున్న ప్రకటనలతో, ప్రభుత్వం కూడా అలోచించి అడుగులు వేస్తుంది. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి, సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవసరమైన భూములను సేకరించేందుకు అధికార యంత్రాంగం ఏవిధంగా ముందుకు వెళ్తుందోనన్న దానిపై చర్చలు సాగుతున్నాయి.