‘తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండగ. ఈ సంప్రదాయాన్ని తరతరాలకు కొనసాగిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. నూతన శక్తిని ప్రసాదించాలి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను తెలుగువారంతా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకొంటున్నా’ అంటూ నారావారిపల్లె నుంచి తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తన సొంతూరు.. చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకొన్నారు. ఈ ఆనవాయితీని ఆయన నాలుగేళ్ళుగా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదీ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.
చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరీమణులు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, కుమారుడు లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్, చంద్రబాబు తమ్ముడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తదితరులు నారావారిపల్లెకు చేరుకున్నారు. వీరందరూ ఉదయం తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకుని, మళ్ళీ స్వగ్రామం చేరుకున్నారు... అంతకు ముందు తల్లిదండ్రుల సమాధి వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.
చంద్రబాబునాయుడు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను గ్రామస్థుల నుంచి స్వయంగా స్పీకరించారు. సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.చంద్రబాబు వెంట భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు చంద్రబాబు స్వయంగా ఇంటికి వచ్చి, క్షేమ సమాచారం అడిగి, సమస్యలు అడిగి తెలుసుకోవటంతో వారి ఆనందానికి అవధులు లేవు... రాష్ట్రానికి రాజు అయినా, సొంత ఊరికి మాత్రం పెద్ద కొడుకే కదా అని అనుకుంటున్నారు...