తమది పసిపాపలా సాకాల్సిన నూతన రాష్ట్రమని, రాజధాని అమరావతిని కూడా నిర్మించుకోవాల్సి వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దావోస్‌లో జరిగిన సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నారు. ఏపీని నాలెడ్జి హబ్‌గా, ఇన్నోవేషన్ సెంటర్‌గా మార్చాలనేదే తమ ధ్యేయమని చెప్పారు. సీఐఐతో తనకున్న సుదీర్ఘమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి, ఏపీలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఐఐని ఆహ్వానించినట్టు తెలిపారు.
ప్రాధాన్యతారంగాలను ఏడు మిషన్లుగా విభజించి తాము దార్శనికపత్రం రూపొందించుకున్నామని, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచార ఉద్యమాలు తీసుకుని ప్రగతికి దిశ నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఇ-ప్రగతి, ఏపీ ఫైబర్ గ్రిడ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి ఇంటినీ ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేశామని, ప్రస్తుతం మేం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ నెట్వర్క్ వున్న రాష్ట్రంగా అవతరించామని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం నెలకు రెండు డాలర్ల ఖర్చుతో టెలిఫోన్, టెలివిజన్, వైఫై సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఇదే సమావేశంలో రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజా పాల్గున్నారు... ఆయన మాట్లాడుతూ, ‘ఇరవై ఏళ్ల క్రితం మొదటిసారి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశాను. అప్పట్లో నాకంత విశ్వాసం కలుగలేదు. కానీ ‘రహేజా మైండ్ స్పేస్ సెంటర్’ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, అందించిన సహకారం, చేసిన కృషి ఆయనపై నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు విజయవంతమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నేను చంద్రబాబు నాయుడు పేరే చెబుతాను.’ అంటూ రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజా బుధవారం దావోస్‌లో జరిగిన సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి పాలనా సామర్ధ్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.