ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా స్పందిస్తారో తెలుసుకోవటం కష్టం... మొన్నిటి దాక, ప్రభుత్వ బిల్లుని తొక్కి పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘాటు లేఖలు రాసి, ఇప్పటికీ బీజేపీ నేతల చేత విమర్శలపాలవుతున్న గవర్నర్ నరసింహన్, ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశంసలతో ముంచెత్తారు... మొన్న కెసిఆర్ ని, కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని చెప్పి, అందరి చేత విమర్శలు పాలైన గవర్నర్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా అదే రేంజ్ లో పొగిడితే బ్యాలన్స్ అవుతుంది అనుకున్నారో ఏమో కాని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కంప్లిమేంట్ ఇచ్చారు...
విశాఖపట్టణం జిల్లాలోని పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం గ్రామంలో ఈ రోజు గవర్నర్ నరసింహన్ పర్యటించారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పథకాల అమలు తీరు పై లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని గణతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చెప్పబోతున్నానని అన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్న చంద్రబాబు, 24/7 కాకుండా 25/8 గంటలు/రోజులు పనిచేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. సౌభాగ్యరాయపురం గ్రామమైనప్పటికీ పట్టణ ప్రాంతానికి ధీటుగా అన్ని వసతులతో బాగుందని, ఇక్కడి ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉండటం తాను గమనించానని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘సౌభాగ్యరాయపురం’లోని ‘రాయ’ పదాన్ని తొలగించి ‘సౌభాగ్యపురం’గా ఆ గ్రామం పేరు మార్చాలని జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.