ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథ చక్రాలు.. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ నగరంలో పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతినీ, అమరావతి విశిష్టతనూ స్విట్జర్లాండ్‌లో చాటుతూ.. ఆంధ్రప్రదేశ్ బస్సు రయ్యి రయ్యిన దూసుకు వెళుతోంది. ఆంధ్రా బస్సేంటి..? స్విట్జర్లాండ్‌లో పరుగులు పెట్టడం ఏంటి..? అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్తున్న సందర్బంగా..పెట్టుబడుల్ని ఆకర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ బస్సు స్విట్జర్లాండులో పరుగులు పెడుతోంది.
స్విట్జర్లాండ్‌లో.. ప్రపంచ ఆర్థిక వేదికగా భాసిల్లే దావోస్ నగరంలో.. ఓ బస్సు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్ అన్న స్లోగన్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోలతో ఉన్న ఈ బస్సు.. అక్కడి ప్రయాణికులను రయ్యి రయ్యిమంటూ గమ్యస్థానాలకు చేరుస్తోంది. సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట, విదేశీ పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో జరిగే ఎకనామిక్ ఫోరమ్‌లను లక్ష్యంగా చేసుకొని.. పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే... ఈ బస్సు ద్వారా.. ఇలా ఏపీ రాష్ట్రానికి ప్రచారం కల్పిస్తోంది.
దావోస్ నగరంలో ప్రపంచ ఆర్థిక వేదిక 48వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా హాజరు కానుంది. దావోస్‌కు వచ్చే వాణిజ్య వేత్తలను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం సదస్సుకు వారం ముందు నుంచే బస్సు ద్వారా ఏపీ గురించి ఇలా ప్రచారం ప్రారంభించింది. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. వాణిజ్యవేత్తలంతా ఇట్టే గుర్తుపట్టే విధంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. దావోస్ లాంటి నగరంలో ప్రచార రథాలను పరుగులను పెట్టించడం ద్వారా విదేశీలను విశేషంగా అకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెద్ద మొత్తంలో రానున్నాయనే అభిప్రాయం ఏపీ సర్కార్ లో ఉంది. ప్రభుత్వ ఉద్దేశమెలా ఉన్నా.. దావోస్ రహదారులపై దూసుకుపోతున్న రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు మాత్రం.. స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.