రాయలసీమ చివరి అంచుదాకా.. ఆఖరికి నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి జలాలను తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే... పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన అనుభవంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది... దీనికి సంబంధించి ‘గోదావరి - పెన్నా అనుసంధానం మొదటి దశ’ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.
పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 15,370 క్యూసెక్కుల గోదావరి నీటిని తరలించవచ్చని చెప్పారు. 1,370 క్యూసెక్కుల జలాలు వృథాగా పోయినా 7వేల క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు వినియోగించవచ్చని, మిగిలిన 7వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు ఎత్తిపోయొచ్చని తెలిపారు. గోదావరి - పెన్నా అనుసంధానం మొదటి దశకు మొత్తం 1,778 ఎకరాలు సీకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. మొదటి దశ కార్యరూపం దాల్చడానికి రూ. 4,617 కోట్లు వ్యయం కానుందని అంచనా వేశారు. అలాగే మొత్తం 5 దశల్లో చేపట్టాలని భావిస్తున్న గోదావరి - పెన్నా అనుసంధానానికి రూ. 83,565 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు.
ఇవన్నీ సమీక్షించిన చంద్రబాబు, గోదావరి - పెన్నా నదుల సంధానంలో భాగంగా తొలి దశ నిర్మాణం కోసం ఈ నెలలోనే టెండర్లను పిలవాలని నిర్ణయించారు... రూ.4617 కోట్ల వ్యయంతో చేపట్టే తొలిదశ పనులను ఆరునెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి దశలో నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలిస్తారు... సాగర్ కుడి కాలువలోకి 120 రోజులపాటు రోజుకు 7వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 73 టీఎంసీలు తరలిస్తారు....