రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకోసం తాము లోక్‌సభలో పోరాడుతుంటే మీరు అభ్యంతరం తెలుపుతారా? అంటూ తెలుగుదేశం సభ్యులు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర కాంగ్రెస్ సభ్యులపై దుమ్మెత్తిపోశారు. మీవల్లనే రాష్ట్రం ఆథోగతి పాలైందంటూ వారు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన మీరు మావైపు నిలబడి నిరసన ఎందుకు తెలుపుతున్నారు, అధికార పక్షం వైపు నిలబడవచ్చు కదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ సభ్యులతో తెలుగుదేశం సభ్యులు గొడవపడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సోనియా వారికి నచ్చజెప్పేందుకు తీవ్రంగా కృషి చేయవలసి వచ్చింది.
ఖర్గే ప్రసంగం పూర్తయ్యాక లోక్‌సభలో అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. అనంతరం సుజనాచౌదరి బయట మాట్లాడుకుందాం రమ్మంటూ సహచరులను పిలిచారు. అప్పుడు ఒకొక్కరుగా వెళ్తుండగా సోనియాగాంధీ కేశినేని నానిని పిలిచి.. మీరు వారిపై దండయాత్ర చేయకుండా మావైపు నిల్చొని ఎందుకు నిరసన తెలుపుతున్నారని ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ ప్రధానికి మా నిరసన తెలియాలనే ఇటువైపు నిల్చొని ఆందోళన చేపట్టామని చెప్పారు.
మీరు ఇదివరకు చేసిన తప్పిదం వల్లే ఇన్ని ఇబ్బందులొచ్చాయని పేర్కొన్నారు. విభజన చేసి రాష్ట్రాన్ని దెబ్బతీశారని, మీరూ దెబ్బతిన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద భాగస్వామ్యం ఉండేదని, ఇప్పుడు అక్కడ మీరు పూర్తిగా కనుమరుగయ్యారని చెప్పారు. పోనీ విభజన వల్ల కాంగ్రెస్ లాభపడిందా అంటే రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోయింది. కేంద్రంలోనూ అధికారంలోకి రాలేకపోయారని నాని అన్నారు. దీంతో తానూ ఏకీభవిస్తున్నట్లు ఆమె నానితో చెప్పారు.