రాజధాని నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ముడిసరుకు, ఇతర భారీ సామగ్రి తరలించేందుకు జలరవాణా పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఫెర్రీ నుంచి రాజధానికి ముడిసరుకు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు కేంద్ర జలవనరులశాఖ అనుమతితో భారీ పంటు నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. ఫెర్రి నుంచి లింగాయపాలేనికి వెళ్లేందుకు పంచాయతీలో 9 నెలల క్రితం తీర్మానం చేయగా, పాలకవర్గం ఆమోదం తెలిపింది.
రాజధాని అవసరమైన ముడిసరుకు, రాతి క్వారీ మెటీరియల్ తో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు విజయవాడ మీదుగా రావాలంటే ఎంతో సమయం పడుతుంది... అది కూడా రాత్రి వేళ మాత్రమే భారీ వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా కంటే రాతి క్వారీల నుంచి ఎక్కువ ఉత్పత్తి, కృష్ణా జిల్లాలో జరుగుతుంది. ఆ సరుకును తేలికగా రాజధాని తరలించినట్టయితే రాజధానికి ముడిసరుకు కొరత తీరుతుంది...
దీనిని దృష్టిలో ఉంచుకుని భారీ పంటు పై ఒకేసారి 30 లారీలు సుమారు 150 టన్నులు తరలించే విధంగా నిర్మాణం చేశారు. అది విజయవంతమైతే మరికొన్నిటిని అనుమతిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు... భారీ పంట్లు సఫలీకృతం అయితే రాజధాని ట్రాన్స్పోర్ట్ అవకాశాలు మెరుగవుతాయని అబిప్రాయ పడుతున్నారు. ఫెర్రి వద్దకు భారీ వాహనాల రాకపోకల వల్ల భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంగమం రహదారి గుండా భారీ వాహనాలు అనుమతిస్తే కరకట్ట కుంగిపోయే అవకాశం ఉంది. దీని పై కూడా ప్రభుత్వం ప్రత్యామ్న్యాయం ఆలోచిస్తుంది...