ఇదే ఆఖరీ బడ్జెట్, మరి ఇప్పుడయినా నవ్యాంధ్ర ఆశలు ఫలిస్తాయా? విభజన హామీలు అమలుచేస్తారా? ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నమైన రైల్వేజోన్ సాకారమవుతుందా? రాజధాని నగర నిర్మాణానికి సొమ్ముల సంగతేమిటి? బడ్జెట్ లోటు లెక్క ఈసారయినా తేల్చి, నిధుల విడుదల ఉంటుందా? టీడీపీ కోరుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరిస్తుందా? శంకుస్థాపన చేసిన విద్యాసంస్థలకు నిధుల మాటేమిటి? మొత్తంగా నవ్యాంధ్ర పై కేంద్రం కరుణిస్తుందా? మునుపటి మాదిరిగానే కఠినంగా ఉంటుందా? ఈసారి తేడా వస్తే చంద్రబాబు, మోడీకి రాంరాం చెప్పేస్తారా ? ఇదీ.. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి, చివరి బడ్జెటిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల అంతరంగం!
బడ్జెట్ సమావేశాల పై ఏపీ ప్రజలు, ప్రభుత్వం వేయి ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు, గ్రాంట్లు, రైల్వే జోన్ వంటి కీలక అంశాలపై కేంద్ర స్పందన కోసం రాష్ట్ర ప్రజలతో, చంద్రబాబు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా హామీని విస్మ రించి, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు అని ప్రజలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ఆ అపవాదుకు బీజేపీ తెరదించుతుందా? లేక నిధుల సమస్యలతో మళ్లీ దాటవేత ధోరణి ప్రదర్శిస్తుందా అన్న ప్రశ్నలకు నేటి బడ్జెట్ సమాధానం చెప్పనుంది. ఏపీ జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై నెలకొన్న వివాదానికి తెరదించాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పై ఇప్పటిదాకా 7780కోట్లు రావలసి ఉంది. అయితే కేంద్రం నుంచి 4300 కోట్లు వరకే అందాయి. మిగిలిన నిధుల కోసం ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది.
ఇది ఈ బడ్జెట్లో కాకపోతే ఇక అసాధ్యమే. 13వ షెడ్యూల్లో ఉన్న 11 సంస్థల్లో ఇప్పటివరకూ వచ్చినవి 9 మాత్రమే, వాటికి ఇప్పటివరకూ ఇచ్చింది కేవలం 400 కోట్లు మాత్రమే. మిగిలినవి పూర్తి కావాలంటే పూర్తి స్థాయి నిధులివ్వాలి ఉంది.. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సి ఉంది.. 16 వేల కోట్ల రెవిన్యూలోటు భర్తీ కింద ఇప్పటివరకూ 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది... విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రం ఇచ్చిన నిధులు వాటి ప్రహరీ గోడలకే సరిపోవడం లేదు. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఎక్కువ నిధులు ఖర్చుపెడుతుండటం గమనార్హం. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం సంతృప్తికర స్థాయిలో నిధులు, ప్రాజెక్టులు కేటాయించకపోతే.. ఇన్నాళ్ళు ఓర్పుగా, చూసిన చంద్రబాబు, ఇక బీజేపీతో యవ్వారం తేల్చేసే అవకాసం ఉంది...