విజయవాడలో ట్రాఫిక్ ఎంత పెద్ద సమస్యగా తయారు అయ్యిందో అందరికీ తెలిసిందే... అమరావతి రాజధానిగా చెయ్యటం, అంతకు ముందు తాత్కాలికంగా ప్రభుత్వం మొత్తం విజయవాడ నుంచే పరిపాలన చెయ్యటం, సిటీ పెరగటం, ఇలా అన్ని సమస్యలతో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువ అయింది.. ఒక పక్క విఐపి మూమెంట్ ఉండటం, మరో పక్క కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటం, ట్రాఫిక్ నియంత్రించటంతో కూడా, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు.. ఇటు వైపు గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది.. మరో పక్క, గొల్లపూడి నుంచి, భవానీపురం మీదగా సిటీకి వచ్చే ట్రాఫిక్ కూడా అంతే... ఈ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు బయటకు వెళ్ళాలి అంటేనే హడలి పోతున్నారు...
ప్రధానంగా కనకదుర్గ వారధి దగ్గర నుంచి గన్నవరం విమానశ్రయం వరకు, లారీలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి రావడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది అని, ఇదే ప్రధాన కారణం అని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు నెల రోజుల క్రితం, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు... సిటీలోకి పెద్ద వాహనాలు రాకుండా, ఎన్ హెచ్ - 216 మీదుగా మళ్లించాలన్న కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ రహదారుల సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
ప్రకాశం జిల్లా వద్ద ప్రారంభమయ్యే 216వ నెంబర్ జాతీయ రహదారిని రేపల్లె, పెనుమూడి, పామర్రు, కత్తిపూడి మీదుగా ఐదో నెంబర్ జాతీయ రహదారికి మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై జాతీయ రహదారుల సంస్థ నుంచి స్పందన బాగానే వస్తున్నా. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారుల నుంచి అంతగా స్పందన రావటం లేదు. ఎన్ హెచ్ - 216 విస్తరణ పనులు జరుగుతున్నందున భారీ వాహనాలు ఇటు మళ్లిస్తే మరిన్ని సమస్యలు వస్తాయని అధికారులు వాదిస్తున్నారు. దీని పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు అయితే సమగ్ర అధ్యయనానికి సమాయత్తమయ్యారు. వారు కనుక ఒప్పుకుంటే, విజయవాడ వాసులకి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి...