నాలుగు జిల్లాల్లో తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తూ ఒక్కో ఐఎఎస్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 12, 13 తేదీలు అత్యంత కీలకం కాబట్టి జిల్లాలన్నింటిని అప్రమత్తం చేశామని ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప అనంతపురం జిల్లాలలో అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. మొదటిసారిగా ఇస్రో ఇచ్చిన సూక్ష్మస్థాయి అధ్యయన నివేదిక వార్థా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితిపై విజయవాడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సమీక్షించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ప్రభుత్వ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప,అనంతపురం జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
గాలి వేగం, దాని వల్ల జరిగే నష్టం ఎలా ఉంటుదనే విషయాన్ని ఇస్రో అంచనా వేసి జిల్లా యంత్రాగానికి తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి నష్టం జరిగే పరిస్థితి వస్తే కొన్ని గంటల్లోపే అక్కడ పునరుద్ధరణ చర్యలు పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. బాధ్యతరాహిత్యంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏ అధికారి కూడా వ్యవహారించిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇది అధికారులందరికీ పరీక్ష సమయం...ఈ సమయంలో వచ్చే వరదనీటిని ఒడిసి పట్టుకోని అవకాశాలుగా మలుచుకోని భూగర్భజలాలు పెరగటానికి, చెరువులు నింపడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వార్థా తుపాను 12 వ తేదీ సాయంత్రానికి శ్రీహరికోట - కృష్ణపట్నం మధ్య తీరాన్ని దాటవచ్చని ఇస్రో శాస్త్రవేత్త రాజశేఖర్ వెల్లడించారు. తీరాన్ని దాటుతున్నప్పుడు గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు తెలిపారు. 11 వ తేదీ సాయంత్రం విశాఖ నుండి నెల్లూరు వరకు తీరం వెంబడి వర్షాలు కురవవచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. గత తుపాను మాదిరిగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో సరాసరి 190 మి.మీ వర్షపాతం 6 జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో 12 వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 గంటల వ్యవధిలో 15 సెంమీ ల వర్షపాతం కురవచ్చని ఆయన అన్నారు. తుపాను ఎమర్జెన్సీగా భావించి ఆయా జిల్లాలోని అధికారులు సెలవులను రద్దు చేసుకుని విధులకు హజరవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 రోజుల సెలవులు, పెద్దనోట్ల సమస్య, తుపాను ఒకేసారి రావడం దురదృష్టకరమని, ఇలాంటి సమయాల్లోనే అధికారులు ప్రజలకు భరోసా అందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
నెల్లూరు జిల్లాలో అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉందని నెల్లూరు కలెక్టర్ ముత్యాలరాజు వివరించారు. వార్థా తుపాను ప్రభావం 12 మండలాల్లో ఉండవచ్చన్న నెల్లూరు కలెక్టర్ , ఈ మండలాల్లో 872 మంది గర్బీణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు.