ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమించింది. అమలుకు నోచని విభజన హామీలతో అభద్రతాభావంలో కూరుకుపోయిన ఆంధ్ర జాతికి ఇప్పుడు పోలవరం ప్రాణనాడి కాబోతోంది. ఆల్మట్టి నిర్మాణంతో ఆకా రం కోల్పోయిన కృష్ణా బేసిన్‌కు జీవనాడై ఊపిరులు ఊదబోతోంది. అడుగడుగు విఘ్నాలతో ప్రాజెక్టుపై ప్రజలు ఆశలు కోల్పోతున్న దశ లో ఈ విళంబి నామ సంవత్సరంలో పోలవరం ఊహలకు అందని ప్రొగ్రెస్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు పూర్తయిన 55 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటు తుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుం డడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది. పోలవరం ప్రాజెక్టుపై పలు హామీ లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంపై నానాటికీ ఆశలు కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో సింహభాగం పోలవరానికే కేటాయించి అయినా వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 23 సార్లు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన ఆయన ఈ నెల 18న మరోసారి పోలవరం సందర్శనకు వెళ్లబోతున్నారు. అదే రోజున ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న డయాఫ్రమ్ వాల్‌ను ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రతి సోమ వారం క్రమం తప్పకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జాప్యానికి గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణంగా భావించిన ప్రభుత్వం ఆ పనులను ట్రాన్స్‌ట్రాయ్ నుంచి నవయుగకు బదిలీ చేసింది. అప్పటి నుంచే పనుల్లో కూడా కదలిక వచ్చినట్లు కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటి వరకు 55 శాతానికి చేరుకోగా అందులో సగ భాగం గడిచిన 5 నెలల కాలంలోనే జరగడంతో లక్ష్యానికి తగ్గట్టుగా అనుకున్న సమయానికి పనులు పూర్తయితాయన్న ఆశాభావం ప్రభుత్వంలో కనిపిస్తోంది. 4వేల మంది కార్మికులు, 150 మంది ఇంజనీర్లు, అత్యాధునిక యంత్రాలతో యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్న తీరును బట్టి ముఖ్యమంత్రి ఆశయం నెరవేరే అవకాశం మెండుగానే కనిపిస్తుంది.
496 రోజుల వ్యవధిలోనే 1400 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ పని పూర్తికావడం పోలవరం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అతి తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పూర్తికావడం పట్ల ముఖ్యమంత్రి పూర్తి సంతృప్తితో ఉన్నారు. డయాఫ్రమ్ వాల్‌ను ఈనెల 18న జాతికి అంకితం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన స్పిల్‌వే పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే సగ భాగం పూర్తి అయింది. ఇప్పటివరకు రోజుకు 3వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతుండగా, రోజుకు 4వేల క్యూబిక్ మీటర్ల పనులు జరిగేలా అదనపు యంత్రాలను రం గంలోకి దించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి కాగా, ఇందుకు సమాంతరంగా కాపర్‌డ్యామ్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇదిలా ఉండగా పోలవరం ప్రధాన కుడికాలువ పనులు 93 శాతం పూర్తికాగా, ఎడమ కాలువ పనులు 60 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికే పోలవరం ప్రాజెక్టుపనులు పూర్తిచేసి , గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.