ఒకాయిన అమరావతిని భ్రమరావతి అంటాడు... ఇంకో ఆయన, అమరావతిని ఏనుగుని మేపుతున్నట్టు మేపుతున్నారు అంటాడు... వీరిద్దరూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం యాత్రలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. మన రాష్ట్ర రాజధాని అమరావతిని, 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులని ఇలా ఎగతాళి చేస్తున్నారు. శ్రీకాకుళం వెళ్లి, అమరావతికి దోచి పెడుతున్నారని అక్కడ ప్రజలని రెచ్చగొడతారు. రాయలసీమ వెళ్లి, మన దగ్గర రాజధాని లేకుండా అమరావతి కడుతున్నారు అంటారు. ఇలా వీరిద్దరూ ఎంత రెచ్చగొట్టినా, అక్కడ ప్రజలు మాత్రం, అమరావతి మనది అనే భావనలో ఉన్నారు. మొన్న శ్రీకాకుళం నుంచి వచ్చి వృధ్యాప్య పెన్షన్ లో కొంత భాగం, అమరావతికి ఇచ్చిన ముసలి అవ్వను చూసాం. ఇప్పుడు రాయలసీమ నుంచి ఒక టీ కాచుకునే వ్యాపారి, అమరావతి కోసం తన వంతు సాయం చేసారు.
జిల్లా కేంద్రమైన కడప ఐటీఐ సర్కిల్ గాంధీ పార్క్ ఆవరణలో సుభాన్బాషా అల్లం టీ వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. చిన్నపాటి వ్యాపారంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అలాంటి సుభాన్.. తనకు కలిగినంతలో సమాజానికి ఎంతోకొంత సేవచేయాఆలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి తనవంతు సాయమందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఇటీవల విజయవాడలో జరిగిన మహానాడు కార్యక్రమానికి హాజరై.. తను పైసాపైసా కూడగట్టిన రూ.20 వేల మొత్తాన్ని సీఎం చంద్రబాబుకు అందజేసి ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.
తన టీకొట్టు వద్ద గాంధీ పార్క్ ఆవరణను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తూ కడప కార్పొరేషన్ కమిషనర్ ప్రశంసలు కూడా అందుకున్నారు. కాగా, తన సంపాదనలో కొంత మొత్తం పొదుపుచేసి సమాజసేవకు ఖర్చు చేస్తానని తాజాగా సుభాన్ ప్రకటించడంపై స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు, దగా పడ్డ మన రాష్ట్రానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తారని, రాష్ట్రం పై కుట్రలు చేస్తున్న వారు ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాలి. ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు పన్ని, మన తల్లి లాంటి అమరావతి పై, ప్రజల్లో వీరు ఎంత విష భీజాలు నాటాలని చూసినా, శ్రీకాకుళం నుంచి, అనంతపురం వరకు, ప్రజలు అందరూ అమరావతి మాది అనే భావనతో ఉన్నారు. మనల్ను రోడ్డున పడేసిన వారికి, అద్భుతమైన రాజధాని కట్టి చూపించాలనే కసితో ఉన్నారు.