తెల్లకాగితాలు, రిజిస్ట్రేషన్ చేయని ఇతర పత్రాలపై భూముల ఒప్పందాలు చేసుకున్నారా? వాటిని ఇప్పుడు ఇతరులకు విక్రయించలేకపోతున్నారా? సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ శాఖ అనుమతించడం లేదా? వీటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. మన రాష్ట్రంలో సాదాబైనామాలు (తెల్లకాగితాలపై భూముల కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు, ఒప్పందాలు రాసుకోవడం) చాలానే ఉన్నాయి. వీటితో ముడిపడిన భూములను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అలాగే వాటిని ఇతరులు కొనలేని.. అమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్-ఆర్వోఆర్) చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2వ తేదీని కటా్‌ఫగా పెట్టుకుని అప్పటి వరకు ఉన్న సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ఆమోదించింది.
రాష్ట్ర విభజనకు ముందు... అంటే 2014, జూన్ 2నాటికి ఉన్న సాదా బైనామాల (తెల్లకాగితాలపై రాసుకున్న భూమి ఒప్పందాలు)ను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 321 నంబరుతో జీవో గురువారం జారీ అయింది. ఇందుకు రైతులు స్థానిక తహసీల్దార్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ‘‘సాదా బైనామాలు ఉన్న రైతులు తొలుత సంబంధిత మండల తహసీల్దార్ వద్ద 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది గ్రామీణ ప్రాంత రైతులకు మాత్రమే వర్తిస్తుంది. సాదా బైనామాల కింద 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి. రిజిస్ట్రేషన్ కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెల్లకాగితాలు , రిజిస్ట్రేషన్ చేయని ఇతర పత్రాలపై చేసుకున్న ఒప్పందాల భూములను ఎలాంటి స్టాంప్ డ్యూటీ లేకుండా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 2.5 ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట పొలంలోపు రైతులకే ఈ జీవో వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమబద్దీకరణ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ జీవో గురించి రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో జరిగిన అన్ రిజిస్టర్ సేల్ డీడ్లకు ఈ జీవో వర్తించదని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తెలిపారు.