2014 నుంచి, ఈ సంవత్సరం మార్చ్ 13 దాకా చంద్రబాబుని ఆహా ఓహో అంటూ పొగిడిన పవన్, మార్చ్ 13 నుంచి సడన్ గా యూ టర్న్ తీసుకుని, బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, అప్పటి నుంచి చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు గురించి పెద్దగా పట్టించుకోక పోయినా, అప్పుడప్పుడు చంద్రబాబు కూడా పవన్ పై చురకలు అంటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి, ఈ రోజు ఒకే కార్యక్రమంలో పాల్గుననున్నారు. మరి ఇద్దరూ పలకరించుకుంటారో లేదో చూడాలి. విషయానికి వస్తే, శ్రీ భూసమేత దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు– విజయవాడ మధ్యనున్న నంబూరు గ్రామ పరిధిలో జరగనుంది. సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తోపాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గణపతి సచ్చిదానంద ఉదయం ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత ఆయన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.
విగ్రహం 11 అడుగులు కాగా.. పీఠంతో కలిపి 12 అడుగులు ఉంటుంది. గణపతి, మహాలక్ష్మి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తారు. అదే విధంగా జీవ ధ్వజం ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరుపుతారు. ఇవన్నీ ఏకకాలంలో శుభ ముహూర్తంలో జరగడం మరో విశేషం. ఈ మంగళ క్రతువులో భాగంగా అవదూత దత్తపీఠం ఆస్థాన పండితులు, మైసూరు వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధానార్చకులు ముక్తేవి మాధవాచార్యులు ఆధ్వర్యంలో ఇప్పటికే 21 రోజులుగా పూజలు, హోమాది కార్యక్రమాలు ఆలయంలో జరుగుతున్నాయి. 28 మంది వైఖానస ఆగమ వేద పండితులు యంత్రానుష్ఠానం చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం గణపతి సచ్చిదానంద స్వామీజీతో చక్రార్చన, అనుగ్రహ భాషణ, యాగశాల సందర్శనతోపాటు సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణాన్ని జరిపించారు.
ఈ నెల 24న ఇదే ప్రాంగణంలో శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణానికి తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలను టీటీడీ ఇక్కడకు పంపనుంది. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠ రోజు దాదాపు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తూ అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకూ ఆలయ ధర్మకర్తలు చొరవ తీసుకుంటున్నారు. హాజరు కానున్న సీఎం: ఉదయం 10:45 గంటలకు సీఎం చంద్రబాబు విచ్చేసి, 12 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారని భావిస్తున్నారు. సీఎం రాకపై గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వెలుపల 600 మీటర్ల మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో 820 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.