నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీకి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం సహాయం చేయకున్నా ఏపీ సొంతంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని అన్నారు. పోలవరం నిర్మాణానికి నిధులు సత్వరమే ఇవ్వాలని అన్నారు. అలాగే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం నిధులివ్వాలని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తొలుత ప్రధాని మోడీ అధ్యక్షోపన్యాసం చేశారు. తరువాత అక్షర క్రమంలో ముందుగా ఏనీ సీఎం చంద్రబాబుకు ప్రసంగించే అవకాశం లభించింది. తన ప్రసంగంలో చంద్రబాబు కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇసుమంతైనా సహకారం అందించడంలేదని దుయ్యబట్టారు. హోదా విషయంలో కేంద్రం మాటతప్పిందని ఫైర్ అయ్యారు. ఒక దశలో కేంద్ర హోంమంత్రి, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం సమన్వయకర్త రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. మీకిచ్చిన సమయం అయిపోయింది. ముగించండని ఆదేశించారు. అయితే చంద్రబాబు ఆయనకు దీటుగా బదులిచ్చి….దేశంలోనే ఏపీ ప్రత్యేకమని గట్టిగా చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందనీ, ఏపీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణకు నిధులు ఇవ్వడంలో జాప్యం తగదన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను వెంటనే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఎస్టీపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు సొంతంగా పన్నులు విధించుకునే అవకాశం లేకపోయిందన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగుతోందని చెప్పారు. ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని విమర్శించారు.
అయితే, మన రాష్ట్రానికి రెండు రాష్ట్రాల మద్దతు లభించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మాట్లాడిన వీరిరువురూ కూడా ఏపీకి, ఏమీ సీఎం కు సంఘీ భావం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ రాజ్యసభ సాక్షిగా ఇచ్చారనీ, దానికి నెరవేర్చి తీరాలని సమావేశంలో మతమ ప్రసంగాలలో విస్పష్టంగా పేర్కొన్నారు. అలాగే తమ తమ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అయితే మీడియా ముందు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పే కెసిఆర్, అక్కడ మాత్రం మౌనంగా ఉన్నారు. మొత్తానికి, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సమస్యలను జాతీయ స్థాయిలో అందరి దృష్టీ అకర్షించేలా చేయడంలో సఫలీకృతులయ్యారని నితీష్, మమతల ప్రసంగాల ద్వారా తేటతెల్లమైంది.