వైకాపా శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టారు. ఇదే సమయంలో ఆయన ఆయా నియోజకవర్గాల్లో ఏ మేరకు అభివృద్ధి జరుగుతోందో కూడా ఆదివారం వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ఎన్నో ఆశలతో ముఖ్యమంత్రిగా చంద్రబాబును అధికారంలోకి తెచ్చారని, అయితే కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించినప్పటికీ ఈ నాలుగేళ్లలో వారు ఉద్ధరించింది ఏమీ లేదన్నారు.
కీలకమైన శాసనసభ సమావేశాలకే వైకాపా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటూ గుర్తుచేశారు. వీరిలో ఏ ఒక్కరు కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు. ఏ నెలకానెల జీతాలు మాత్రం తీసుకుంటూ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారన్నారు. తమకు మాత్రం రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండా అని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను పట్టించుకోకపోయినా తాము మాత్రం ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తన శాఖ తరపున వైకాపా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏమేరకు ఖర్చుచేసిందీ గణాంక వివరాలు సహా మంత్రి లోకేష్ వివరించారు.
మరో పక్క, ఏపీలో ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయంటూ వైసీపీ ఎంపీలు, నేతల ప్రశ్నలకు కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన సమాధానమిచ్చారు. ఇప్పటికే ఏపీకి 531 పరిశ్రమలు, లక్షా 29వేల 661 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 2.64 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర పరిశ్రమల శాఖ గతంలో సమాధానమిచ్చిందని అన్నారు. అందుకే ఆ పార్టీవారిని అసెంబ్లీ నుండి పారిపోవద్దని సీఎం పదే పదే రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎవరైనా ముందుకు వస్తే పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో, ఉద్యోగాలు ఎక్కడ కల్పించామో చూపిస్తామన్నారు. పరిశ్రమల మంత్రి స్వయంగా వారిని తన వెంట తీసుకొని వెళ్తారంటూ.. మీరు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు.