నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపరచాల్సిన బాధ్యత మీదేననీ, మంత్రులు ప్రజలకు చేరువకావడం లేదంటూ సిఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. దీనిలో పలు అంశాలపై విస్తృతస్ధాయి చర్చ జరిగినట్లు తెలిసింది. అగ్రిగోల్డు వ్యవహారంపై సిఎస్ అధ్యక్షతన అధికారుల కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన డయల్ 1100కు ప్రతిపక్షపార్టీ ఫిర్యాదులు చేస్తోందని, వాటిపై విచారణ సరిగా చేయకపోవడంతో అనర్హులకు లబ్ధి చేకూరుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలకే పరిష్కార బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. అయితే ఇది మరో జన్మభూమి కమిటీలా తయారవుతుందని మంత్రులు చెప్పగా సమస్యలు లేకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు. అలాగే నియోజకవర్గాల్లో ఇటీవల సమస్యలు ఎక్కువవుతున్నాయని, జిల్లా ఇన్‌ఛార్జు మంత్రులు ఆయా జిల్లాలను పట్టించుకోవడం లేదని, ఎన్నికల సంవత్సరంలో జాగు చేయొద్దని, ఇష్టం లేకపోతే చెప్పాలని సిఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భూ కుంభకోణాల విషయంలో మంత్రులు ఆచితూచీ మట్లాడాలని, ఎంపిలను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. విచారణ జరిగే అంశాలపై ఇటీవల కొందరు మంత్రులు మాట్లాడుతున్నారని, అది ఇక ముందు జరగకూడదని చెప్పినట్లు తెలిసింది. విశాఖపట్నం వ్యవహారంపై మంత్రి అయ్యన్న, గంటా విషయం వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పినట్లు సమాచారం.
బిజెపి వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత జాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీల విషయంలో అడ్వాన్స్‌గా వ్యవహరించి వైసిపి తీరును ఎండగట్టాలని సూచించారు. తాను ఢిల్లీలో ప్రధానిని కలిసిన అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే ఒకరిద్దరు మంత్రులు మినహా ఎవరూ పట్టించుకోలేదని అన్నట్లు తెలిసింది. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు రూ.55 వేలు లింకు చేశారని, మూడు నెలల నుండి నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని మంత్రులు సిఎం ముందు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లకపోవడంపై ఆశాఖ మంత్రిని మందలించినట్లు సమాచారం. తెల్ల రేషన్‌కార్డులు ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇచ్చే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రణాళిక రూపొందించాలని, ఇవే రేపు ఎన్నికల్లో కీలకంగా మారతాయని సిఎం సూచించారు.