దేశమంతా ఎలక్ట్రిక్ వాహనాల (ఈ-వెహికల్) యుగం మొదలవుతోంది. ‘గ్రీన్ ఎనర్జీ’ని సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం, పర్యావరణ సహిత రవాణా వ్యవస్థని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాల సాకార రూపంగా కరెంటు బళ్లు రోడ్డెక్కనున్నాయి. అమరావతి రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగర రహదారులపైకి మరో రెండు నెలల్లో విద్యుత్ వాహనాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంఓయూ) మేరకు 500 ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలను ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్) సరఫరా చేయనుంది. టాటా, మహేంద్ర సంస్థల నుంచి వాహనాలను కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఈఈఎస్‌ఎల్ తీసుకుంది.
మొదటి విడతగా వచ్చే వాహనాలను రాష్ట్రంలోని మూడు నగరాల్లోగల ప్రభుత్వశాఖల ఉన్నతాధికారుల వినియోగం కోసం కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దశల వారీగా మొత్తం పదివేల వాహనాలను ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర మోటారు వాహనాల వినియోగం తాజా లెక్కల ప్రకారం కోటికిపైగా పెరిగింది. లీటర్ డీజిల్ వినియోగంతో 2.5 కిలోల బొగ్గు పులుసు వాయువు గాలిలో కలుస్తూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కర్బన ఉద్గారాలు జీరో శాతం ఉంటాయని, రూ.10 ధరకు లభించే యూనిట్ విద్యుత్తుతో ఆరు కిలో మీటర్ల దూరం కారులో ప్రయాణించొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రవేశపెట్టాక దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసేలా రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీగా ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ప్రణాళికలు రూపొందించింది. 2020-21 నాటికి రాష్ట్రంలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి తీసుకురావాలన్నది ప్రయత్నం. దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు రహదారులపై పరుగులు తీస్తున్నాయి. మూడు ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్ కోసం 250 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, ఆసుపత్రుల వద్ద వీటిని ప్రారంభిస్తారు. ఇలాంటి స్టేషన్లు కేవలం విద్యుత్తు ఉత్పాదక సంస్థలు మాత్రమే నిర్వహించాలన్న 2003 విద్యుత్ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సవరణలు చేసింది. అందువల్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున త్వరలో ప్రకటన చేయనున్నారు. ఏపీ ‘ఎలక్ట్రానిక్ మొబిలిటీ విధానాన్ని’ గత నెలలో మంత్రిమండలి ఆమోదించడంతో త్వరలో జీవో విడుదల కానున్నది.