శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రావికంటపేట గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేసి గురువారం ఉదయం ప్రారంభించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఎడ్లతో నాగలి పట్టి దుక్కిదున్నారు. విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి సాంప్రదాయపద్ధతికీ, యాంత్రీకరణ పద్ధతి గురించి వ్యవసాయ శాస్త్రవేత్త చిన్నంనాయుడును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు శాస్త్రవేత్త చిన్నంనాయుడు బదులుస్తూ విత్తనం ఖర్చు 50 శాతం తగ్గుతుందని, అలాగే సాగు ఖర్చు ఎకరానికి రూ. 4 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు.
అలాగే దిగుబడిలో యాంత్రీకరణకు, నేరుగా వేసే పద్ధతులకు గల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. యాంత్రీకరణ ద్వారా ఎకరాకు 28 నుండి 32 బస్తాల వరకు దిగుబడి వస్తుందనే వివరాలను శాస్త్రవేత్తలు ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా ఈ యంత్రం ద్వారా విత్తనాలు వేయడానికి ఎకరాకు రూ.850/-లు అవుతుందని, దీనిద్వారా ఒకే పద్ధతిలో వరుసగా వస్తుందని అన్నారు. , వెదజల్లే పద్ధతికి, యాంత్రీకరణకు అయ్యే ఖర్చు సరిసమానంగా అవుతుందని, యాంత్రీకరణ పద్దతి ద్వారా రెండు మూడు బస్తాల వరకు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.
అనంతరం సీడ్ డిబ్లర్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. యంత్రం ద్వారా ముఖ్యమంత్రి నాట్లు వేసారు. తొలుత హెలీప్యాడ్ నుండి సాంప్రదాయ వస్త్రధారణతో ఎడ్లబండిపై ఏరువాక కార్యక్రమం వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయనకు ధింసా నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బి.సి.సంక్షేమ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు కిమిడి కళా వెంకటరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి,డా. బెందాళం అశోక్, కలమట వెంకటరమణమూర్తి , గాదె శ్రీనివాసులనాయుడు, ఆమదాలవలస పురపాలక సంఘ చైర్ పర్సన్ తమ్మినేని గీత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.