కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోగ్యం పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. ఈ మేరకు ఆయన కోల్‌కతా రాజ్‌భవన్ నుంచి కడప జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. సీఎం రమేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, తన ఆరోగ్యం దినదినం క్షీణిస్తున్నా, పట్టు సడలకుండా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని రమేశ్ తేల్చి చెబుతున్నారు. ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్రసింగ్ ఆయనతో 15 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించాలని కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయాలని మంత్రిని కోరిన విషయం తెలిసిందే.
మరో పక్క, అమెరికా నుంచి వచ్చిన సీఎం రమేష్ ఫ్యామిలీ డాక్టర్ రాజాతల్లూరి రమేష్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదని ఐసియూలో పెట్టి చికిత్స చేయాల్సిన స్టేజీలో వున్నారని చెప్పారు. ఇంకా దీక్ష కొనసాగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ రాజాతల్లూరి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కాగా సీఎం రమేష్‌తోపాటు దీక్ష చేపట్టి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్యం క్షీణించడంతో నిన్న ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వానికి 9 అంశాలతో మెకాన్ సంస్థ.. అదే విధంగా కేంద్రం కూడా 9 అంశాలపై క్లారిటీ కావాలని కోరింది. అందులో 7 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఇంకా 2 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదంటూ నిన్న బీరేంద్ర సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న మెకాన్ సంస్థ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో రెండు అంశాలకు క్లారిటీ ఇవ్వాలని కోరింది. అందులో లాండ్, లింకేజి విషయంలో స్పష్టత రావాలని కోరింది. మెకాన్ లేఖకు సమాధానంగా ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం సమాధానం రాసింది. లాండ్కు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చింది.