ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లెబాట పట్టారు. ఏ హడావిడి లేకుండా, ఏ ప్రచారం లేకుండా, ప్రజల మధ్యకు వెళ్లారు. అందులో భాగంగా చినమత్తూరు మండలం, దిగువపల్లి తండా గ్రామంలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామున నిద్రలేచి దినచర్యలో భాగంగా వ్యాయామం చేశారు. సినిమాల్లో తాము చేసే ఫీట్లకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో బాలయ ముఖాముఖి చర్చలు జరిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అంతా విస్తృత పర్యటనలకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా బుధవారం ‘మూడు రోజుల పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టారు.
తొలిరోజు చిలమత్తూరు మండలం చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం దిగువపల్లె ఎస్టీ తాండాలో బాలకృష్ణ పల్లెనిద్ర చేశారు. అంతకు ముందు ప్రజల నుంచి వినతులు అందుకొన్నారు. గ్రామానికి రహదారి, దేవాలయం మంజూరు, సామాజిక భవనం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. గ్రామంలో అందరూ నిరుపేదలేనని భూముల్ని లేపాక్షినాల్జెడ్ హబ్‌కు తీసుకోవడంతో వలసలు తప్పలేదన్నారు. ఉపాధి మార్గం చూపాలని కోరారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ భూములు ఈడీ చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు, నేరుగా వారి వద్దకే వెళుతున్నట్టు ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తెలుగు ప్రజలకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళుతున్నారన్నారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజల వద్దకే వచ్చానని తెలిపారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొనేందుకు వస్తారని, మోసపోవద్దని, అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోమని ప్రజలకు సూచించారు. కడప ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక నడవా, విశాఖ రైల్వేజోన్, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అందించాల్సి ఉండగా అడ్డుచెబుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాజీనామా పేరిట వైకాపా నేతలు డ్రామాలు ఆడుతున్నారని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడంలేదన్నారు. గత పాలకులు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకొని దోచేశారన్నారు.