మొన్న హోం గార్డ్ లకు, ఈ రోజు అంగన్‌వాడి కార్యకర్తలకు, చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో, వారిని ఆదుకుంటున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో తన నివాసంలోని ప్రజాదర్భార్ హాలులో సాధికార మిత్రలతో జరిగిన సమావేశంలో ఆయన అంగన్ వాడీలపై వరాల జల్లు కురిపించారు. 7500లుగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్ల పైచీలుకు భారం పడుతుందని చెప్పారు.
అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి అంగన్‌వాడీల వేతనాలను పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలోనే అంగన్‌వాడీలందరికీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒక్క ఆడపిల్లా చనిపోవడానికి వీల్లేదన్నారు. గర్భిణులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శిశుమరణాల సంఖ్య తగ్గిందన్నారు. కేరళతో పోల్చి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. చిన్న పిల్లలు చనిపోకుండా ఉండాలనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.. ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీల సంఖ్య పెరగడంతో పాటు పిల్లలకు టీకాలు వేసే విధానంలోనూ ఇంకా మెరుగుదల రావాలని సూచించారు.
అలాగే వివిధ పధకాల పై కూడా మాట్లడారు.. "చంద్రన్న పెండ్లి కానుక ఆర్ధిక చేయూత ఇవ్వడం జరుగుతున్నది. ఏప్రిల్ 1 న ప్రారంభించిన చంద్రన్న పెండ్లి కానుక కోసం ఇప్పటి వరకు 14601 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 90 శాతం వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. పాఠశాల విద్యా కమిషనర్ విద్యా సంవత్సరం లో రూ.4800 కోట్ల తో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేసారు. బయో మెట్రిక్ హాజరు వల్ల ఉపాద్యాయులు హాజరు 98 శాతం ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు వల్ల డ్రాప్ ఔట్స్ జీరో శాతానికి చేరగలిగాము.ఇకపై విద్యార్థిని, విద్యార్థులకు ఇకపై ఇచ్చే 3 గుడ్లకు బదులు 5 గుడ్లకు పెంచడం జరుగుతున్నది. సాధికార మిత్రాల పనితీరుపై పోటీ పెడతాను. 4 లక్షల 62 వేల మంది సాధికార మిత్రాలు త్వరలో నే స్మార్ట్ ఫోన్లు అందచేస్తాను" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.