కొన్ని దశాబ్దాలుగా ఆ కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసిన రమణ దీక్షితులు, గత కొన్ని రోజులుగా అమిత్ షా సేవలో తరించటం చూసాం, జగన్ ఇంటికి వెళ్లి ఆశీర్వదించటం చూసాం, ఇప్పుడు ఏకంగా అన్యమతస్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న దీక్షితులు, మరోసారి తెర పైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తప్ప, అన్ని చోట్లా ప్రెస్ మీట్లు పెట్టే ఆయన, ఈ రోజు హైదరాబాద్ లో పెట్టారు. చంద్రబాబు పై మరోసారి ఆరోపణలు చేసేందుకు హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రమణ దీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని క్రిస్టియన్ ప్రతినిధి బోరుగడ్డ అనిల్ ఆర్గనైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు.
సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను అనిల్ నిర్వహిస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఇతను.. సైమన్ అమృత్ ఫౌండేషన్ సంస్థకు సీఈవో, ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. మీడియా సమావేశంలో రమణ దీక్షితులు వెనుక అనిల్ ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ బోరుగడ్డ అనిల్, మత ప్రచారం మాత్రమే కాదు, నేరాలు కూడా చేస్తూ ఉంటాడు. గతంలో అమరావతిలో భూ వివాదంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప పేరు చెప్పుకొని పలు నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తితో రమణ దీక్షితులుకి సంబంధం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం గుంటూరులోని వల్లూరివారి తోటలో… భీం సేన పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించారు. భీంసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ బోరుగడ్డ అనిల్ రమణ దీక్షితులుకు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ.. శ్రీవారి సేవల గురించి ప్రెస్‌మీట్ లో అనిల్ బాధపడ్డారు. రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తారని కూడా తనే ప్రకటించారు. 24 ఏళ్లపాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలందించిన రమణ దీక్షితులు.. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంతో టీటీడీ ఆయనకు రిటైర్మెంట్ ప్రకంటించింది. అప్పటి నుంచి రమణ దీక్షితులు తన ఆరోపణలను మరింత ముమ్మరం చేశారు. లోటస్‌పాండ్ వెళ్లి జగన్‌ను కలిశారు. నాడే అన్యమతస్తుల ఇంటికి ఎలా వెళ్తారనే విమర్శలు వచ్చాయి. అయినా రమణ దీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారిని కలుస్తానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేరుగా మత ప్రచార సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.