ఒక పక్క పవన్, జగన్, కడప ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతు ఇవ్వకుండా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ, కేవలం తెలుగుదేశం వల్లే ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. మరో పక్క, పక్క రాష్ట్రాల నేతలు వచ్చి, కడప ఉక్కు దీక్షకు మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షకు డీఎంకే పార్టీ నాయకురాలు కనిమొళి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల లాంటి వారని చెప్పారు. రాష్ట్రాల గురించి కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిందన్నారు.
బీజేపీకి హిందుత్వం తప్ప, మరో సమస్య పట్టదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల వైపు నిలబడతారని భావించి చంద్రబాబు నాయుడు ఆయనను నమ్మారని, విశ్వసించారని, అందుకే మద్దతు పలికారని ఆమె చెప్పారు. కానీ ప్రధాని అందరి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మరిచిపోయారన్నారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సీఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడారని గుర్తుచేశారు. కేంద్రం మాట మీద నిలబడి ఉంటే ఈపాటికి విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేవని చెప్పుకొచ్చారు.
మరో పక్క, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారం నాటికి 7వ రోజుకు చేరింది. వారి ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్రం దిగివచ్చి ఏదోఒకటి చెప్పేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం డాక్టర్లు వచ్చి తమను పరీక్షించారని, బీపీ తగ్గిందని దీక్ష విరమించి.. డాక్టర్ల సూచనలు పాటించాలని అన్నారని రమేష్ చెప్పారు. అయితే ఏదోఒకటి సాధించేవరకు తామ దీక్షకు విరమించేది లేదని అన్నారు. తమ దీక్షను విద్యార్థులు అర్థం చేసుకోవాలని, ఈ ఉద్యమాన్ని వారే ముందుకు తీసుకువెళ్లాలని రమేష్ కోరారు. ఢిల్లీ నుంచి కబురు వచ్చే వరకు తమ దీక్ష కొనసాగుతుందన్నారు.