దేశం రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు చూపించి, కేంద్ర మోసాన్ని ఎండగట్టారు చంద్రబాబు... అయినా చలనం లేదు... నీతీ ఆయోగ్ మీటింగ్ లో, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు, కేంద్రం మోసం చేస్తుంది అంటూ ప్రధాని ముందే కడిగి పడేసారు.. అయినా కేంద్రానికి చలనం లేదు... 5 కొట్ల ఆంధ్రులు ఆందోళన చేస్తున్నా, రెండు పార్టీలని తన గుప్పెట్లో పెట్టుకుని, నాటకాలు ఆడుతుంది... అందుకే, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశ అత్యున్నత న్యాయ స్థానం, సుప్రీం కోర్ట్ లోనే తేల్చుకోవటానికి సిద్ధమైంది. నరేంద్ర మోడీ చేసిన నయవంచనను సుప్రీం కోర్ట్ ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.
ఏపీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, పక్కన పెట్టిందని ఏపీ అఫడవిట్లో కేంద్ర తీరును తప్పుబట్టింది. అంతేకాదు హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా పన్ను రాయితీలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టింది. వెనకబడిన జిల్లాలకు 24,350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరామని, రూ. 1050 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7918.40 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్రం రూ. 5349.70 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఏపీ తెలిపింది. సవరించిన రూ. 57,948.86 కోట్ల పోలవరం అంచనాలకు అనుమతించలేదని, విభజన హామీల్లో ఏ ఒక్క దానిని కేంద్రం అమలు చేయలేదని ఆరోపించింది. షెడ్యూల్-9లో ఉన్న 142 విద్యాసంస్థల విభజన ఇంకా పూర్తికాలేదని, కడప స్టీల్‌ప్లాంట్, గిరిజన వర్సిటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ పేర్కొంది.
నాలుగేళ్లలో జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి 10శాతం కన్నా తక్కువ నిధులు కేటాయించారని, దుగరాజపట్నం పోర్టు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాట్లపై దృష్టి సారించలేదని వాపోయింది. రైల్వేజోన్ ఇంకా పరిశీలనలోనే ఉందని కేంద్రం చెబుతోందని, అమరావతి నిర్మాణానికి రూ. 11,602 కోట్లతో డీపీఆర్ పంపామని, రూ. 1500 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.