హైదరాబాద్ లో ఉన్న సెలబ్రిటీ ఎవరైనా సరే కెసిఆర్ ను ఒక్క మాట అనాలి అంటే భయపడిపోతారు. ఇక సినిమా వాళ్ళు అయితే సరే సరి. కెసిఆర్ కు ఎలాంటి భజన చేస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రముఖ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మల్యే కోట శ్రీనివాసరావు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ఒక పక్క బీజేపీ నాయకులు చంద్రబాబు పై విమర్శలు చేస్తూ, నానా మాటలు అంటుంటే, మాజీ బీజేపీ నాయకుడుగా, కోటా ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఆసక్తి నెలకొంది. ముక్కుసూటిగా మాట్లాడే కోటా, ఏ విషయం పై అయినా కుండ బద్దులు కొట్టేస్తారు అనే పేరు ఉంది. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు గురించి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, ఉన్న విషయం చెప్పేశారు.
అమరావతి నిర్మాణంపై కోట శ్రీనివాసరావు తన మనసులోని మాట చెప్పారు. తన ఉద్దేశం ప్రకారం హైదరాబాద్‌లా అమరావతి కావాలంటే 20 ఏళ్లు పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపున్న నాయకుడని.. రాష్ట్రం ఆయన చేతిలో ఉండటమే మంచిదన్నారు. ఆయన తప్ప ఇంకెవరు చేయగలరని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ... అసెంబ్లీలో ఉండకుండా... బయట తిరగటం సరికాదన్నారు. ఇప్పుడేమైనా ఎన్నికలున్నాయా అని అడిగారు. పార్టీ మారేవాళ్లనూ ఆయన వదల్లేదు. ఒక పార్టీలో ఉండి గెలిచిన తర్వాత .. మరో పార్టీకి వెళితే.. ప్రజలకు సమాధానం చెప్పాలన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. పార్టీ మారమని జనం చెబితే మారాలని తెలిపారు.
అలాగే కెసిఆర్ గురించి చెప్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ అదృష్టవంతుడని.. 'ఒలిచిన అరటి పండు' చేతిలో పెట్టినట్టు రాష్ట్రాన్ని ఇచ్చారని.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సహా అన్నీ ఇక్కడే ఉన్నాయన్నారు. దేనిపైనా అయినా కేసీఆర్.. గట్టిగా మాట్లాడగలరని చెప్పారు. హోంగార్డులకు జీతాలు పెంచడంతో పాటు.. నీళ్లు, కరెంట్ ఇస్తున్నారన్నారు. ఇవే చేయగలరని... అంతేకానీ తరాలు మార్చేంతగా గొప్పవేం లేవన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇది అని తెలంగాణ గురించి చెప్పుకొచ్చారు. తెలంగాణాలో అన్ని వనరులు చక్కగా అమర్చి ఉన్నాయని, కెసిఆర్ ఇక్కడ పెద్దగా కష్టపడేది ఏమి లేదని చెప్పారు.