రాం మాధవ్, జీవీఎల్ తో పాటు, ఢిల్లీ నుంచి చంద్రబాబు పై అవాక్కులు చావాక్కులు పేలే నేత మురళీధరరావు.. ఈయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు... అయితే దేశంలో బీజేపీకి వస్తున్న వ్యతిరేకత చూసో కాని, మొత్తానికి ఇప్పుడిప్పుడే భూమి మీదకు దిగుతున్నారు. చుక్కలు చూపిస్తాం, జైల్లో పెడతాం, కేసులు పెడతాం అంటూ హడావిడి చేసిన బీజేపీ నేతలు, నెమ్మదిగా చల్లబడుతున్నారు. ఇదంతా చంద్రబాబు సత్తా ఏంటో చూసిన తరువాతే.. కర్ణాటకలో వేసిన దెబ్బ కాని, అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక తాటి పైకి తేవటం కాని, ఇవన్నీ చూసి, చంద్రబాబు తక్కువాడు కాదనే అంచనాకు వచ్చారు. ‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటపడుతుందని తాము ఊహించామని... కానీ, తమ అంచనాలకు భిన్నంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాదికి ముందే తమకు విడాకులు ఇచ్చారని అన్నారు. రాజకీయంగా చూస్తే చంద్రబాబు చేసింది తప్పని తనకు అనిపించడం లేదని తెలిపారు. ఎన్నికలనాటికి ఏ అంశాలు ప్రధానంగా మారతాయో ఇప్పటి నుంచే చెప్పడం కష్టమన్నారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందనే చంద్రబాబు రాజకీయ క్రీడ మొదలు పెట్టారు. అయితే... బీజేపీ, మోదీ, అమిత్‌షాలను అంచనా వేయగల నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఏ పరిణామాన్నీ తేలిగ్గా వదలకుండా తుదిదాక పోరాడే శక్తి ఆయనలో ఉంది’’ అని మురళీధర రావు విశ్లేషించారు.
తెలుగుదేశం తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటికీ బీజేపీ ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో రంగంలోకి దిగలేదని ఆయన చెప్పారు. చంద్రబాబులాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు, వేదికలు ముందుకు వస్తాయని... వివిధ సామాజిక సమీకరణాలు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో చిరంజీవి విఫలమైనట్లు పవన్ కూడా విఫలమవుతారన్న అంచనాలు సరైనవి కావని... అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ వర్గాలను తనతో తీసుకెళ్లగలిగిన సామర్య్థాన్ని పవన్ కల్యాణ్ ప్రదర్శించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ని ముందుకు నడిపిస్తుంది మేమే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు.