ప్రతిపక్ష నేత జగన్‌తో తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సమావేశమయ్యారు. లోటస్‌పాండ్‌కు వెళ్లిన రమణ దీక్షితులు, జగన్‌తో మంతనాలు జరిపారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు ముందుగానే పాదయాత్రకు విరామిచ్చిన జగన్ గురువారం సాయంత్రం లోటస్‌పాండ్ చేరుకున్నారు. ఆ తర్వాత రమణ దీక్షితులు లోటస్‌పాండ్‌కు వచ్చారు. వీరిద్దరు ఏ విషయంపై చర్చించారనే దానిపై వైసీపీ వర్గాలు నోరుమెదపడం లేదు. కొద్దిరోజుల క్రితం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో దీక్షితులు మంతనాలు జరిపారు. ఆ తర్వాతే ఆరోపణలపర్వం ప్రారంభించారు. ముందుగా చెన్నైలో ఆ తర్వాత ఢిల్లీలో ఈ తరహా ఆరోపణలు చేశారు. అప్పడే టీటీడీ ఆయనకు రిటైర్డ్‌మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా దీక్షితులు ఆరోపణలపర్వం కొనసాగించారు. ఇప్పుడు నేరుగా జగన్‌తో దీక్షితుల భేటీ కావటం కలకలం రేపుతోంది.
అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరింది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఈ భేటీకి ప్రత్యేకత లేదని కొట్టిపారేస్తున్నాయి. తన పోరాటానికి జగన్ మద్దతు కోరేందుకు వచ్చారని చెబుతున్నారు. రమణదీక్షితులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారనే ఆరోణలున్నాయి. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కావాలని అప్పట్లో కొండపై యాగం చేశారని ప్రచారం జరిగింది. నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. ఇప్పటికీ దీక్షితులు తన ఇంట్లో శ్రీవారి చిత్రపటం పక్కన వైఎస్ చిత్రపటం పెట్టుకుంటారనే ప్రచారం ఉంది.
రమణ దీక్షితులు రాజకీయ ఎజెండాతో శ్రీవారి ఆలయం, పవిత్రత, ఆభరణాలపై ఓ పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. గురువారం సాయంత్రం రమణదీక్షితులు జగన్‌ను కలవడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ రమణ దీక్షితులు వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని అన్నారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం... అంటే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం, కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామాలు చేసిన తర్వాత.. రాష్ట్ర హక్కుల కోసం టీడీపీ కేంద్రంపై పోరాటం చేయడంతో... ఇవన్నీ ముందుకు వచ్చాయని, 30 ఏళ్లు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షుతులు శ్రీవారికి అన్ని రకాల సేవలు చేశారని, అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు వ్యక్తం చేస్తూ, భక్తుల మనోభావాలు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడారంటే.. ఆయన వెనుక వివిధ రాజకీయ శక్తులు ఉన్నాయని ఆయన అన్నారు. ఇవాళ రమణ దీక్షితులు జగన్‌ను కలవడంతో ఒక్కొక్క ముసుగు తొలిగిపోతోందని బోండా ఉమ అన్నారు.
తమిళనాడులో మీటింగ్ పెట్టిన తర్వాత రమణ దీక్షితులు అమిత్ షాను కలిసారని, ఇవాళ లోటస్ పాండులో జగన్‌ను కలిసారని... అంటే రమణ దీక్షితులు వెనుక ఈ శక్తులన్నీ ఉన్నాయన్నది స్పష్టమవుతోందని బోండా ఉమ అన్నారు. రేపు ఎవరిని కలుస్తారో అని అన్నారు. రమణ దీక్షితులకు రాజకీయ నాయకులతో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే వారంతా కలిసి ప్రభుత్వం పై విషం కక్కుతున్నారని, మహా కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రమణ దీక్షితులు ఏం చెప్పినా భక్తులు నమ్మరని బొండా ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు.