మిత్రపక్షం శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ సారథి అమిత్ షా చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు కనిపించడంలేదు. ఆ పార్టీ అథినేత ఉద్ధవ్ థాకరేతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అమిత్ షా భేటీ సానుకూలంగా ముగిసినప్పటికీ.. శివసేన మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు తేల్చి చెప్పింది. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావత్ స్పష్టం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయాలని పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. పార్టీకి సంబంధం లేని వెలుపటి వ్యక్తులు వచ్చి ఆ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేయగలరు?’’ అని ప్రశ్నించారు. అమిత్ షా ఎందుకు వచ్చారో తమకు తెలుసుననీ... అయితే శివసేన తీర్మానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదన్నారు.
మరో పక్క, బీజేపీకి మరో పార్టీ నుంచి ఊహించని షాక్ తగిలింది. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) నుంచి వైదొలుగుతున్నట్టు బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రకటించింది. సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా... ఇవాళ పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీయే సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలకు ఎన్నెన్ని సీట్లు ఇస్తారో నిర్ణయించాలని కూడా ఈ నెల 2న ఆర్ఎల్ఎస్పీ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్డీయేకి గుడ్‌బై చెప్పిన ఆర్ఎల్ఎస్పీ... బీహార్ మహాకూటమిలో చేరేందుకు ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.