మొన్న ఆగస్టులో.. నిన్న జూలైలో..ఇప్పుడు జూన్‌లో! ఒక్కో ఏడాది గడుస్తున్నకొద్దీ, కృష్ణమ్మ వైపు గోదారమ్మ పరుగు పెరుగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రం పై స్పష్టంగా ఉన్న నేపధ్యంలో, కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు జలవనరుల శాఖ సంసిద్ధమైంది. అల్పపీడనం కారణంగా భారీవర్షాలు పడతాయని, గోదావరి నదికి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12వ తేదీన పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ వదిలితే కృష్ణా జిల్లాకు వచ్చే సరికి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాధారణ వర్షాలే పడినా.. పరివాహక ప్రాంతంలో ఎక్కడా పెద్దగా నీరు లేకపోయినా కృష్ణా డెల్టాలోని రైతాంగాన్ని పట్టిసీమ జలాలు ఆదుకున్నాయి. రికార్డు స్థాయిలో 100 శాతం మేర నాట్లు పూర్తి అయ్యాయి. డెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల్లో వరి దిగుబడులు భారీగా వచ్చాయి. నాట్లు వేసిన నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోయింది. దీంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరింది.
గత ఏడాది జూన్‌లోనే తూర్పు, పశ్చిమ కాలువలకు నీటిని వదిలారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. వరుసగా రెండు ఏడాది కూడా జూన్ నెలలోనే డెల్టాకు సాగునీటిని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే వేసవిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీరు - చెట్టు కింద కాలువల్లో పనులు చేశారు. నీటిని వదిలినా ఇబ్బంది లేకుండా సిద్ధం చేశారు. ప్రధాన కాలువల్లో అడ్డంకులను సిబ్బంది తొలగించారు. ప్రకాశం బ్యారేజిలో ప్రస్తుతం 2.86 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని తీసుకోనున్నారు. కానీ తొలుత పెద్దగా నీరు అవసవరం లేనందున 2వేల క్యూసెక్కులు ఇచ్చి, ఆతర్వాత రైతుల అవసరాలను బట్టి పెంచనున్నారు. బ్యారేజిలో నీటి మట్టాన్ని పెంచి ఆతర్వాత కాలువలకు వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గత ఏడాదిలా మొదట తూర్పు కాలువ పరిధిలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇస్తారు. రెండు రోజుల వ్యవధిలో పశ్చిమ కాలువకు విడుదల చేస్తారు.
కృష్ణా డెల్టా కింద పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తూర్పు కాలువ పరిధిలో 7.36 లక్షల ఎకరాలు, పశ్చిమ కాలువ కింద 5.71 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 11.12 లక్షల ఎకరాలలో వరి, చెరకు.. 24,213.8 ఎకరాలలో వేస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 140 టీఎంసీలు పైగా ఆయకట్టుకు విడుదల చేశారు. దీంతో మంచి దిగుబడులు వచ్చాయి. గత సీజన్‌లో జులై ప్రారంభం నుంచే నాట్లు ప్రారంభం అయ్యాయి. నిలకడగా సాగునీటిని వదిలారు. ఆరు నెలల పాటు నిరాటంకంగా నీటిని అందించారు. చివరి భూములకూ సకాలంలో నీరు అందడంతో రైతులు గట్టెక్కారు. జలవనరుల శాఖ ప్రణాళికాబద్ధంగా ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి నీటికి స్వల్పంగా కృష్ణా జలాలు తోడు అయ్యాయి. చివరి భూములకు నీటి భరోసా లభించింది. డెల్టా ప్రాంతంలో అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు వస్తాయి. ఆ సమయాలలో వరి పొలాల్లో నీరు నిలిచి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు ప్రభుత్వం గత ఏడాది జూన్‌లోనే విడుదల చేశారు. ముందే విడుదల చేయడం వల్ల దిగుబడులు కూడా పెరిగాయి. దీనిపై రైతుల్లో సానుకూలత వ్యక్తమైంది. ఈ సంవత్సరం కూడా ఇలాగే సాగునీటిని వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టులో దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది కూడా రైతుల్లో భరోసా నింపేందుకు ఇంకా ముందే విడుదల చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోంది.