కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న ఆమరణ దీక్ష 5వ రోజుకు చేరుకుంది. దీక్ష ప్రారంభించి 120గంటలు కావటంతో నేతల ఆరోగ్యం క్షీణిస్తోంది. నిన్న, పలువురు నేతలు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, జగన్‌పై విరుచుకుపడ్డారు. తెలుగు జాతితోనూ, కడప పౌరుషంతోనూ పెట్టుకున్న కేంద్రం దిగిరావల్సిందేనని స్పష్టం చేశారు. జగన్, పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో సైంధవుల్లా మారారంటూ దుయ్యబట్టారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని పవన్, జగన్ విమర్శించకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. వైసీపీ, బీజేపీ జెండాలు వేరైనా అజెండాలు ఒక్కటేనన్నారు. బళ్లారిలోని గాలి జనార్ధన్‌రెడ్డి, కడపలోని జగన్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకే బీజేపీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదన్న చర్చ జనంలో ఉందన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ‘‘2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కడప పౌరుషానికి, ఢిల్లీకి పోటీ అన్నావు. మరి ఇప్పుడేమైంది? జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మోదీని పల్లెత్తు మాట అనవు? దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, కేసుల మాఫీ కోసం కడప పౌరుషాన్ని ఢిల్లీలోని ప్రధానమంత్రి కాళ్ల వద్ద తాకట్టు పెట్టావు. వైఎ్‌సఆర్ కడప జిల్లా అనే పిలిచే అర్హతని కోల్పోయావు’’ అంటూ దుయ్యబట్టారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాయలసీమ పౌరుషం, కడప ముద్దుబిడ్డలం అని చెప్పుకునే వారు ఎందుకు ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా నోరు మెదపడంలేదు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లబేరం, ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డితో రాయబారం వంటి రాజకీయాలకు పాల్పడే వైసీపీ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.
మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్‌కు అనుభవం, అవగాహన లేదన్నారు. అసెంబ్లీ అంటే లోటస్ పాండ్, చట్టం అంటే ఇడుపులపాయ అనుకుంటారని, అనుభవం లేని ప్రతిపక్ష నేత ఉండడం రాష్ట్రానికి దౌర్భాగ్యమన్నారు. మరో పక్క నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. జగన్, బీజేపీ ట్యూన్ లోనే పవన్ మాట్లాడటం, ఉక్కు పరిశ్రమ రాకపోవటానికి కేంద్రం కారణం కదాని, తెలుగుదేశం మాత్రమే కారణం అంటూ, ప్రైవేటు సంస్థలకు స్టీల్ ప్లాంట్ కట్టబెట్టే ప్లాన్ లోనే, పవన్ కూడా మాట్లాడుతున్నారని అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనటం చూస్తుంటే, వీరికి రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అంటున్నారు.