వచ్చే నెల నుంచి విజయవాడ నుంచి పుట్టపర్తి, నాగార్జునసాగర్ మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. విజయవాడ నుంచి ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేకించి పర్యాటకులకు విమానయాన సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ప్రజాభిప్రాయాన్ని కోరినపుడు అత్యధికులు తమ సమ్మతిని తెలిపారు. దీనిపై బిడ్లను ఆహ్వానించినపుడు మిగతా సంస్థల కంటే ‘సుప్రీం ఎయిర్‌లైన్స్’ తక్కువ ఖర్చుకు నడిపేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే సుప్రీం ఎయిర్‌లైన్స్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని సేవలు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి రోజూ ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 9 గంటలకు పుట్టపర్తిలో బయలుదేరి 10.30 గంటలకు విజయవాడకు రానుంది. సాయంత్రం మళ్లీ 5 గంటలకు మరో సర్వీసు నడపనున్నారు. విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు ఉదయం 11 గంటలకు బయలుదేరే విమానం తిరిగి సాయంత్రం 3 గంటలకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో పక్క, విజయవాడ (గన్నవరం)- సింగపూర్ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్, ఈమెయిల్ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. దీంతో, విజయవాడ-సింగపూర్ మధ్య విమానయాన సేవలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రయత్నాలు చేస్తున్నారు.