బీజేపీ నేతలు తమ అతి తెలివితేటల్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చూపించుకోవాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘాటుగా విమర్శించారు. ప్రాజెక్టుల నిధులు, విభజన హామీలను గురించి చేతనైతే దిల్లీలో మాట్లాడాలని.. గల్లీలో కాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడిన బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 55.73 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా.. ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదన్న లక్ష్యంతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయల వడ్డీలను కడుతోందని తెలిపారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకూ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ నేతల దుగ్ధ ఏమిటో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వాన్ని తిడుతున్న భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇతర రాష్ట్రాల్లోని జాతీయ ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన రెండో డీపీఆర్‌ను ఆమోదింప చేసుకునేందుకు జలవనరుల శాఖ అధికారులు దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ముంపు మండలాలను సాధించకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేదే కాదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రగతిని చూడలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నేత జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆరు నెలల తర్వాత కన్నా ఏ పార్టీలో ఉంటారో తెలియదాని, బీజేపీ నేతలు ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని అన్నారు. పోలవరానికి కేంద్రం ఒక్కపైసా బాకీ లేదని పురందేశ్వరికి ఎవరు చెప్పారు? పోలవరానికి సంబంధించిన అన్ని అంశాలు ఆన్ లైన్ లో పొందుపరిచాం, వెళ్లి చూసుకోండి అని చెప్పారు. ఏపీ సాగునీటి శాఖ కు 19 స్కోచ్ అవార్డులు వచ్చాయినే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు.