54 ప్రాజెక్టులలో మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెదపాలెం, చినసేన, పులకుర్తి, ఓక్ టన్నెల్, గోరకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొండవీటి వాగు ప్రాజెక్టు జూలై 15 నాటికి పూర్తికానుందని, జూలై 31 నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు.
గుండ్లకమ్మ రిజర్వాయర్ పనులు తుదిదశకు చేరాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, నెల్లూరు-సంగం బ్యారేజీలు ఆగస్టు 31 నాటికి పూర్తి కానున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబరులో ముల్లపల్లికి నీటి సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు. మల్లిమడుగు, బాలాజీ, వేణుగోపాల సాగర్ రిజర్వాయర్లు నిర్మాణం కోసం అటవీ భూముల సమస్యను పరిష్కరించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్ 2, రెండో దశ పనులు పూర్తిచేసి 5 టీఎంసీల నీటిని జులై 15కి నిల్వ చేయాలని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ప్రాధాన్య ప్రాజెక్టులలో మిగిలిన అన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
జలవనరుల శాఖకు 19 స్కోచ్ అవార్డులు రావడంపై అధికారులకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ కింద ప్లాటినమ్ అవార్డు. మరో పక్క, పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసేందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, అలాగే నూతన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేయడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు.