కడప ఉక్కు దీక్షపై తెదేపా అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సెయిల్ ద్వారా ఉక్కు పరిశ్రమ పెట్టిస్తామన్న విషయం చట్టంలో స్పష్టంగా ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. కడప యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టంచేశారు. చిత్తశుద్దితో చేసే పోరాటం ఎప్పుడూ విఫలం కాదన్నారు. వైకాపా చేసేవి మొక్కుబడి కార్యక్రమాలేనని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజల్లో వాటిపట్ల స్పందన కరవైందన్నారు. తాను పాదయాత్ర, నిరవధిక దీక్షలు చిత్తశుద్దితో చేయడంతో ప్రజాదరణ పొందాయన్నారు.
సొంత జిల్లా అభివృద్ధికి కూడా జగన్ అడ్డంకులు సృష్టించడం హేయమని సీఎం మండిపడ్డారు. కడప ఉక్కు కోసం అనేక లేఖలు రాశామని, పార్లమెంట్ లో పలుసార్లు ప్రస్తావించామని, ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. అయినా కేంద్రంలోని భాజాపా నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారని సీఎం అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మెకాన్ కమిటి అనుకూలంగా నివేదిక ఇచ్చిందన్నారు. కానీ సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ వేశారన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లబ్ధి కోసమే కేంద్రం దీని పై తాత్సారం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందుకే తన సొంత జిల్లాలో ఇంత పెద్ద ప్రజా ఉద్యమం నడుస్తున్నా, జగన్ కు కనీసం చీమ కుట్టినట్టు లేదని, అందుకే ఉద్యమం చెయ్యటం లేదని అన్నారు. భాజాపా, వైకాపా, జనసేన కుట్ర రాజకీయాలను ఎండగట్టి, ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఉక్కు దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని, ‘కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదం దేశం మొత్తం ప్రతిధ్వనించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీక్షకు మద్ధతుగా రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలన్నారు. రేపు అన్నిజిల్లాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, ఎల్లుండి ధర్నాలు చేయాలని, 28వ తేదీన దిల్లీలో ఎంపీలతో ధర్నాలు చేపట్టాలని పార్టీనేతలకు సీఎం ఆదేశించారు. ఈ పోరాటానికి రాష్ట్రంలోని ఐదు కోట్లమంది ప్రజలు సంఘీభావం తెలిపాలని కోరారు.