రాష్ట్రంలో నీటిపారుదలకు సంబంధించిన అన్ని కాలువలను వర్చువల్ విధానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ కేంద్రం నుంచి ఆయన ప్రకాశం బ్యారేజీలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను బ్యారేజీని వర్చువల్ విధానంతో ఆకస్మిక తనిఖీ చేశారు. బ్యారేజీలో గుర్రపు డెక్క ఆకు పేరుకుపోయినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పారుదల శాఖ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ బ్యారేజీలో పరిస్థతి అలా ఉంటే మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుర్గ ఘాట్, తదితర ప్రాంతాలను కూడా ఆయన వర్చువల్ తనిఖీ చేశారు. నాలుగు రోజల్లో ప్రకాశం బ్యారేజీ నీరు పరిశుభ్రంగా ఉండాలని నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో సాగు నీటి కాలువలన్నీ కూడా ఇదే తరహాలో ఇకపై వర్చువల్ తనిఖీ చేస్తానని తెలిపారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి సాగు నీటి కాలవలన్నీ కూడా ఇదే తరహాలో వర్చువల్ తనీఖీలు చేస్తానని, నీటి పారుదలకు ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా అధకారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ జరుగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతున్నది, వాటిపై ప్రజా సంతృప్తి శాతం ఎలా ఉందనే అంశాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాబు ఏ వివరించారు. పింఛన్ల పంపిణీపై 79 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 21 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాలు విశ్లేషించి ఆ లోపాలను భర్తీ చేయాలని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి నెలా 47,20,253 మంది పింఛన్లు అందుకుంటున్నారని, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.549 కోట్లు పంపిణీ చేస్తోందన్నారు. వృద్ధులకు వృద్ద్యాప్య పింఛన్లు ఆసరగా ఉందని, పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పంపిణీ చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల వేలిముద్రలు పడని సమస్యలు వచ్చాయని, అక్కడ ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం అమలు చేస్తామన్నారు. ప్రతి నెల మొదటి పది రోజుల్లోనే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యేలా చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో దెయ్యాలు పింఛన్లు తీసుకునేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎంతో పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి వ్యవస్థ ఉందా చెప్పండి అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఇదే స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో కూడా ఇప్పడు ఎవరూ తప్పించుకోలేరని, అందరూ నిజాయతీ, నిబద్ధతతో పనిచేయాల్సిందేనని తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు రాజమౌళి, గిరిజా శంకర్, సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.