ఢిల్లీలో వైసీపీ - బీజేపీ నేతలు చర్చలు చేస్తూ దొరికిపోవటం, ఇప్పుడు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మల్యే ఆకుల సత్యన్నారాయణ, వైసీపీ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి భేటీ పై వార్తలు రావటంతో, ముందు అవి ఖండించారు.. తరువాత సిసి టీవీ ఫూటేజ్ రావటంతో, కలిసి టిఫిన్ చేసాం అని చెప్పారు, కాని రాం మాధవ్ ను కలవలేదు అని చెప్పారు. రాం మాధవ్ ఇంటికి వెళ్లినట్టు లాగ్ బుక్ లో ఉండటంతో, రాం మాధవ్ ఇంటికి వెళ్ళలేదు అని, రాం మాధవ్ ఇంటి దగ్గర ఒక కార్ దిగి, ఇంకో కార్ ఎక్కామని చెప్పారు. మొత్తానికి, ఇరు పార్టీలు కలిసి, రాం మాధవ్ ఇంట్లో భేటీ అయినట్టు, అక్కడ పీఏసీ చైర్మన్ హోదాలో, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, అసెంబ్లీలోని కొన్ని కీలక పత్రాలు, రాం మాధవ్ కు ఇచ్చినట్టు వార్తలు వచ్చయి. అయితే, ఇప్పుడు ఇవి బుగ్గన మెడకు చుట్టుకునే అవకాసం కనిపిస్తుంది.
సమగ్ర అధ్యయనం చేయడానికే ప్రజా పద్దుల సంఘానికి(పీఏసీ) వివిధ శాఖలు ప్రతులను అందిస్తాయని, వాటిని శాసనసభలో ప్రాతినిధ్యం లేని వ్యక్తికి, రాజకీయ పార్టీ సభ్యుడికి ఇవ్వడం శాసనసభా ధిక్కారమే అవుతుందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీన్ని శాసనసభా ప్రవర్తనా నియమావళి అతిక్రమణతో పాటు నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ కమిటీలన్నీ రాజ్యాంగపరమైన సంస్థలన్నారు. వీటికి సంబంధించిన చర్చలు, ప్రతులు, నివేదికలు అత్యంత రహస్యమన్నారు. వీటిని ప్రసార మాధ్యమాలతో పాటు ఎవరికీ ఇవ్వకూడదన్నారు. గతంలో పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ఎంపీలను ప్రలోభాలకు గురిచేసిన అంశం కంటే ఇది తీవ్రమైనదన్నారు. ఇదే నిజమైతే బుగ్గనపై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) ఎందుకు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు.
ఇదే విషయం పై చంద్రబాబు కూడా స్పందించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి కేంద్రానికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఢిల్లి వెళ్లి భాజపా పెద్దలతో బుగ్గన భేటీ కావడం వైకాపా, బీజేపీ కుట్రలకు పరాకాష్ట అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ ఏదైనా విషయాలుంటే స్పీకర్‌కు తెలియజేయాలని అనంతరం శాసనసభలో దాని గురించి చర్చించా లన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పాత్రలు, బీజేపీ పెద్దలకు చేరవేయడాన్ని సీఎం గర్హించారు. బైట ఫోజులు కొట్టి లోపల లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రలు ఇచ్చినట్టు తేలిన మరు క్షణమే, ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అవకాశం ఉందని, ఛీఫ్ విప్ కూడా అన్నారు. మొత్తానికి, ఇది బుగ్గన మెడకు చుట్టుకునే అవకాసం ఉంది.