సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన వర్చువల్ తనిఖీల సందర్భంగా క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. అక్కడికక్కడే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. గుంటూరు జిల్లాలో వల్లభాపురం-చిన్నపాలెం రోడ్డు, విజయవాడలో స్వరాజ్యమైదానం, రైతుబజారు వద్ద చెత్త డంపింగ్‌పైనా తొలిసారిగా వర్చువల్ తనిఖీలు నిర్వహించారు. వల్లభాపురం రహదారిలో కల్వర్టు నిర్మించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పరిశుభ్ర నగరమని తెలిసినా పారిశుద్ధ్య పరిస్థితులను ఎందుకు నిరంతరం పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వర్చువల్ తనిఖీ సాగిందిలా.. గుంటూరు జిల్లా వల్లభాపురం-చిన్నపాలెం రోడ్డులో కల్వర్టు నిర్మించకుండా మొదట రోడ్డు వేశారు. అనంతరం కల్వర్టు నిర్మాణం కోసం రోడ్డును తవ్వేశారు. దీనిపై ‘డెల్టా రోడ్డు ఉల్టా’ శీర్షికతో పత్రికల్లో కథనం రావడంతో స్పందించిన సీఎం ఈ రోడ్డు పరిస్థితిని వర్చువల్ తనిఖీ చేశారు. అధికారులు, సీఎం మధ్య సంభాషణ ఇలా సాగింది.. సీఎం: ఈ రోడ్డు పంచాయతీరాజ్‌దా.. రోడ్లు భవనాల శాఖదా? అధికారులు: పంచాయతీరాజ్ శాఖది సర్. సీఎం: ఏఈ, డీఈలను లైన్‌లోకి తీసుకోండి. అధికారులు: క్షేత్రస్థాయిలో అందుబాటులో లేరు సర్.సీఎం: ఉదయమే సమాచారం ఇచ్చారు కదా.. ఏఈని సస్పెండ్ చేయండి. ఇంతవరకు మెత్తగా చెప్పాను. ఒకరిద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటే మొత్తం సర్దుకుంటుంది. పనులు సరిగా చేయకపోతే గుత్తేదార్లపైనా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే బ్లాక్ లిస్టులో పెడతాం. ఈలోపు పంచాయతీరాజ్ ఈఈ సుబ్రహ్మణ్యంకు ఇంజినీర్‌ఇన్‌చీఫ్ ఫోన్ చేసి ముఖ్యమంత్రికి ఇచ్చారు.సీఎం: ఒక రోడ్డుకు పైపులు వేయనందుకు ప్రభుత్వం పరువుపోతోంది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మీకు బాధ్యతలేదా? ఎందుకు పూర్తి చేయరు? ఈఈగా ఉన్నావ్.. ఏఈ ఎవరు? రోడ్డు 2016లో మంజూరైతే ఇప్పటి వరకు ఎందుకు కల్వర్టు పూర్తి చేయలేదు. వర్షాలు వస్తాయని తెలిసి మేలోనే ఎందుకు పూర్తి చేయలేదు?
విజయవాడలోని స్వరాజ్‌మైదానం దగ్గర చెత్త డంపింగ్‌పై.. అధికారులు: రైతు బజార్ వద్ద నిత్యం చెత్త వేస్తారు సర్..! సీఎం: నిత్యం ఉండేదేనా! అక్కడ చెత్త వేయడానికి ఆదేశాలు ఏమైనా ఇచ్చారా?(ఆగ్రహం వ్యక్తం చేస్తూ...) అధికారులు: ఉదయం పత్రికలో రావడంతో చాలావరకు శుభ్రం చేశారు సర్.. సీఎం: కమిషనర్ నివాస్ ఎవరు దీనికి బాధ్యులు? మైదానం పరిశుభ్రత బాధ్యతలు ఎవరివి? కమిషనర్: అదనపు వైద్య, ఆరోగ్య అధికారి(ఏఎంహెచ్‌వో)సర్.. సీఎం: ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయండి. విచారణ జరిపించండి.