పోలవరంపై వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. గురంవారం ఉదయం జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ...పోలవరంలో రికార్డుస్థాయిలో 11వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకు వెళుతూ ఉంటే ప్రాజెక్టును, అక్కడ రేయింబవళ్లు పనిచేస్తున్న వందలాది ఇంజనీర్లును, కార్మికులను అవమానించేలా పొలవరాన్ని సినిమాగా చెబుతున్న అజ్ఞాని జగన్ అన్నారు. వైఎస్ తన కుమారుడు ఎదో ఉద్దరిస్తాడనుకుని చదువు కోసం అమెరికా పంపితే తిరుగుటపాలో వచ్చేసిన జగన్ అసలు ఏంచదువుకున్నాడో ఎవ్వరికీ తెలియదు. కొన్నిచోట్ల బీకాం అని, కొన్ని చోట్ల ఎంబిఎ అని ఉంది. జగన్ మానసిక స్థితి కూడా సరిగా లేనట్లుందని, జగన్ సరైన మానసిక నిపుణులతో వైద్యం చేయించుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.
తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి ఆయన పార్థివ శరీరం ఇంకా ఇంటికి కూడా చేరని పరిస్థితుల్లో ఆరోజు కూడా, ఆ సమయంలో కూడా ఇంట్లో కూర్చొని పోలవరం స్పిల్ వే, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ మరియు 960 మెగావాట్ల పవర్ ప్లాంట్లకు టెండర్లు అప్ లోడ్ చేయించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మంత్రి దుయ్యబట్టారు. అవినీతిపరులు, దొంగలైన జగన్, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లకు అందరూ అవినీతిపరుల్లాగే కనిపిస్తారు. మీ హయాంలో అసలైన డ్యామ్ పనులు వదిలేసి మట్టిపనులు చేసి దోపిడీలు చేసి, అదిగో పోలవరం నీళ్లు వచ్చేస్తున్నాయని ప్రజలను మోసం చేసి ధనయజ్ఞం చేసిన చరిత్ర మీది. ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తూ కళ్లెదురుగుండా నీళ్లు పారిస్తున్న చరిత్ర మాది అని మంత్రి ఉమా అన్నారు.
త్వరలోనే గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కూడా చేసి చూపిస్తామని, వైకుంఠపురం బ్యారేజికి పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చామని, దీని ద్వారా నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని మంత్రి చెప్పారు. అలాగే పాపం జగన్ గెలిస్తే రాజధానిని తీసుకెళ్లి ఇడుపులపాయలో పెట్టుకుందామనుకున్నాడని, కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రానికి మధ్యలో ఉండాలని అమరావతిలో పెట్టి అభివృద్ధి చేస్తుంటే అక్కసుతో అమరావతిని భ్రమరావతి అంటున్నాడు అని మంత్రి ఉమా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తానంటే కన్నా టీడీపీ చేరేవాడని, కన్నాను చేర్చుకుంటే జైలుకెళ్తావని జగన్ కు అమిత్ షా వార్నింగ్ ఇస్తే ఆగిపోయి చివరకు రాష్ట్ర బీజేపీ పదవిలో చేరిన కన్నా మాటలకు విలువలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్ర పెద్దల డైరెక్షన్లో వైసిపి, జనసేన, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన బుద్దిచెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు.