కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరిన తరుణంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో తెదేపా ఎంపీల భేటీ ముగిసింది. అనంతరం ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెదేపా ఎంపీల సమక్షంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. కడప ఉక్కు కర్మాగారం విషయంపై ఎంపీలు తనతో చర్చించారని, సుప్రీంలో దాఖలైన పిల్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ అఫిడవిట్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ అఫిడవిట్‌ను ఆయన చదివి వినిపించారు.
సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం పై కేంద్రమంత్రితో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఒక పక్క టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసిందని చెప్తూ, మరి సుప్రీంకోర్టులో ఎందుకు, కుదరదు అని చెప్పారు అంటూ, కేంద్ర మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా ఎంపీలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయనను డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాల పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. వెనువెంటనే ఉన్నతాధికారులతో సమావేశమైన బీరేంద్ర సింగ్ ఉక్కు శాఖ కార్యదర్శి, అధికారులతో సమావేశమయ్యారు. అయితే, మరో సారి ఆయన నుంచి, ఎలాంటి కాల పరిమితితో కూడిన స్పష్టమైన హామీ రాలేదు.
కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై తెదేపా ఎంపీలు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నా స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాల వ్యవధితో కూడిన హామీ ఇవ్వలేదని, దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పినా మంత్రి పట్టించుకోలేదన్నారు. రాష్ట్రమంతా ఆందోళనలు చేస్తుంటే.. కచ్చితంగా ఎప్పటి నుంచి ఉక్కు పరిశ్రమ పనులు మొదలు పెడతారో, ఎన్ని రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తారో అని మంత్రిని పదేపదే కోరినా స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తొలుత సమావేశం అనంతరం మళ్లీ మంత్రి ఛాంబర్‌లోకి వెళ్లి కలిశామని, పరిశ్రమ ఏర్పాటుపై కచ్చితమైన సమయం చెప్పాలని, మెకాన్ నుంచి ఎప్పుడు నివేదిక తెప్పిస్తారో స్పష్టంచేయాలని అడిగినా ఆయన నుంచి స్పందన రాలేదన్నారు. ఓ రాజ్యసభ సభ్యుడు ఆమరణ నిరాహార దీక్షచేస్తున్న సమయంలో స్పందించాల్సిన కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రం నుంచి తాము ఎంతో ఆశించి దిల్లీకి వచ్చామని.. కాలయాపన చేయడం సరికాదని అన్నారు.